Share News

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:11 AM

జగన్‌ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

  • సాక్షి మీడియాకు కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జగన్‌ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తోందని, అభ్యంతరకర కథనాలు, అసత్య వార్తలతో తమ పరువుకు భంగం కలిగిందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హరియాణాలో నమోదైన జరిమానా అంశాన్ని, భోలేబాబా డెయిరీ(ఇందాపూర్‌ డెయిరీ) వ్యవహారాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ముడిపెడుతూ సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. ఇటువంటి కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ మినీ పుష్కర్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హెరిటేజ్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన, ప్రసారం చేసిన అసత్య, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. హెరిటేజ్‌ పరువుకు భంగం కలిగించే అంశాలను ప్రచురించడం, పోస్ట్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం, ప్రచారం చేయడం కొనసాగించకుండా సాక్షి వార్తాపత్రిక, సాక్షి టీవీ, వాటి అనుబంధ సంస్థలు, ఇతర సోషల్‌ మీడియా వినియోగదారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్‌లో అభ్యంతరకర కంటెంట్‌ ప్రసారం కాకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. మెటా (ఫేస్‌బుక్‌), ‘ఎక్స్‌’ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు ఈ వివాదాస్పద కంటెంట్‌ను గుర్తించి, 55 ఫేస్‌బుక్‌ లింకులు, 52 ఇన్‌స్టాగ్రామ్‌ లింకులు, 70 యూట్యూబ్‌ లింకులు, 85 ‘ఎక్స్‌(ట్విటర్‌)’ లింకులను తొలగించాలని తెలిపింది.

Updated Date - Feb 20 , 2026 | 02:14 AM