తెలంగాణ ప్రజా జాగృతిపై త్వరగా తేల్చండి
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:40 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు చెందిన ’తెలంగాణ ప్రజా జాగృతి‘ (టీపీజే) పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఈసీఐకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు చెందిన ’తెలంగాణ ప్రజా జాగృతి‘ (టీపీజే) పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కొత్తపార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోగా ఈసీ జాప్యం చేస్తోందని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈసీ తీరు తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే తన సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అమిత్ బన్సల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ అడ్వొకేట్ రిషికుమార్ సింగ్ గౌతమ్ వాదిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 కింద పార్టీ నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు కోర్టుకు తెలిపారు. అవసరమైన అన్ని పత్రాలు, పార్టీ రాజ్యాంగం, నోటరీ చేసిన అఫిడవిట్లు, 151 మంది సభ్యుల సభ్యత్వ జాబితా సహా అన్ని పత్రాలను సమర్పించామని, నిర్ణీత రుసుము కూడా చెల్లించామని చెప్పారు. కానీ తమ దరఖాస్తు అంశంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవిత దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.