Share News

కాళేశ్వరంలో సీనియర్‌ ఐఏఎస్‌ క్విడ్‌ ప్రోకోను 3 నెలల్లో తేల్చండి

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:10 AM

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అవినీతి (క్విడ్‌ ప్రోకో)కి పాల్పడ్డారన్న ఆరోపణలపై నాలుగేళ్లయినా కేంద్ర ప్రభుత్వం విచారణ జరపకపోవడం పట్ల ....

కాళేశ్వరంలో సీనియర్‌ ఐఏఎస్‌ క్విడ్‌ ప్రోకోను 3 నెలల్లో తేల్చండి

  • కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

  • నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే ఎందుకు ఉందని ధర్మాసనం తీవ్ర అసహనం

  • ఐఏఎస్‌ కుమార్తె పెళ్లి ఖర్చులన్నీ కాంట్రాక్టరే భరించాడన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అవినీతి (క్విడ్‌ ప్రోకో)కి పాల్పడ్డారన్న ఆరోపణలపై నాలుగేళ్లయినా కేంద్ర ప్రభుత్వం విచారణ జరపకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ ఐఏఎస్‌ అధికారి కుమార్తె వివాహ వేడుక ఖర్చులను సదరు ప్రాజెక్టు కాంట్రాక్టరే భరించారన్న ఆరోపణలపై విచారణ జరిపి, మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అక్షయ్‌ మాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక ఐఏఎస్‌ అధికారి ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం చేశారని, ఐదు నక్షత్రాల హోటళ్లలో వేడుకలు నిర్వహించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సింహభాగం కాంట్రాక్టులు పొంది, లబ్ధి పొందిన ఒక ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీయే ఈ పెళ్లి బిల్లులన్నీ చెల్లించిందన్నారు. సదరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆ సమయంలో నీటిపారుదల శాఖకు అధిపతిగా ఉంటూ, కాంట్రాక్టుల కేటాయింపుల్లో కీలక పాత్ర పోషించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై గతంలోనే విచారణ జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని, కానీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘‘2022 అక్టోబరు 12న కేసు విచారణ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. మూడు నుంచి నాలుగు వారాల్లో అది ముగుస్తుందని పేర్కొంది. మరి.. నాలుగేళ్లుగా ఆ విషయం ఇంకా పెండింగ్‌లోనే ఎందుకు ఉంది?’’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో, ‘‘కేంద్రం నిస్సహాయంగా ఉండకూడదు. ఐఏఎస్‌ స్థాయి అధికారులకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కేంద్రానికి కీలక అధికారాలుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏమీ శక్తిహీనమైనది కాదు కదా!’’ అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫిర్యాదును తార్కిక ముగింపునకు తీసుకురావాలని తేల్చిచెప్పింది. మూడు నెలల్లో కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. కాగా, ఇదే అంశంపై 2022 జనవరి 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 22 , 2026 | 05:10 AM