Share News

ఆలస్యంతో అనర్థం..

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:02 AM

జమ్మికుంట మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది స్పెషల్‌ ఇన్సెంటివ్‌ గ్రాంట్స్‌ కింద మూడు కోట్లు మంజూరు చేసింది. ఇందులో 2.05 కోట్లతో కొత్తపల్లి ,

ఆలస్యంతో అనర్థం..

జమ్మికుంట, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది స్పెషల్‌ ఇన్సెంటివ్‌ గ్రాంట్స్‌ కింద మూడు కోట్లు మంజూరు చేసింది. ఇందులో 2.05 కోట్లతో కొత్తపల్లి, గణేష్‌నగర్‌తోపాటు పలు కాలనీల్లోని జంక్షన్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన 95 లక్షలు పాత కూరగాయల మార్కెట్‌ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కేటాయించారు. ఆ నిధులు ఇప్పుడు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. టెండర్లు పూర్తి చేసిన అనంతరం ప్రతిపాదనలను ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. అప్పటికే నిధుల వినియోగ గడువు ముగియడంతో సీడీఎంఏ కార్యాలయం 95 లక్షల నిధులను రద్దు చేస్తూ మున్సిపాలిటీకి నోటీస్‌ జారీ చేసింది.

అధికారుల నిర్లక్ష్యం..

స్పెషల్‌ ఇన్సెంటివ్‌ గ్రాంట్స్‌ నుంచి 2.05 కోట్లతో చేపట్టిన జంక్షన్ల నిర్మాణం, అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ పనులను నిర్ణీత సమయంలో ప్రారంభించలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంజనీరింగ్‌ విభాగం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మున్సిపల్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెండర్‌ ప్రక్రియ పూర్తవడం, నిధులు రద్దు కావడంతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంపై సందిగ్ధం నెలకొంది. నిధులు తిరిగి మంజూరవుతాయా? లేక కొత్త నిధులు సమకూర్చాల్సి వస్తుందా? అనే ఆంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

పాలకవర్గం అసంతృప్తి..

ఈ వ్యవహారంపై పాలకవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యాక నిధులు రద్దు కావడం వెనుక బాధ్యత ఎవరిదనే అంశంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు..

నిధుల పుణరుద్ధరణకు ప్రతిపాదనలు పంపిస్తాం

- వికాస్‌, మున్సిపల్‌ ఏఈ

కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం పరిపాలన ఆమోదం కోసం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. నిధుల గడువు ముగియడంతో సీడీఎంఏ నుంచి రద్దు నోటీస్‌ వచ్చింది. నిధుల పుణరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలు సీడీఎంఏ కార్యాలయానికి పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతాం.

Updated Date - Jul 29 , 2026 | 01:03 AM