కరువు జిల్లాగా ప్రకటించండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:43 AM
జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ బలంగా వస్తున్నది. ప్రభుత్వం జిల్లాలోని మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా అది కూడా మధ్యస్త కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీవోలో పేర్కొనడాన్ని జిల్లాప్రజలు అంగీకరించడం లేదు. జిల్లాలోని పలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ బలంగా వస్తున్నది. ప్రభుత్వం జిల్లాలోని మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా అది కూడా మధ్యస్త కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీవోలో పేర్కొనడాన్ని జిల్లాప్రజలు అంగీకరించడం లేదు. జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని ఆ మండలాలన్నీ మెట్ట ప్రాంతాలు కావడంతో తొందరగా కరువు చాయల్లోకి చేరుకుంటాయని అంటున్నారు. 19 శాతం లోటు వర్షపాతం నుంచి 19 శాతం అధికంగా వర్షం కురిసినా సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. ఈసాంకేతిక కారణంతోనే మైనస్ 19 వరకు ఉన్న మండలాలను సాధారణ వర్షం కురిసిన ప్రాంతాలుగా గుర్తించినా అక్కడ ఇప్పుడిప్పుడే కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అతి త్వరగా భూగర్భ జలాలను లోతుకు పడవేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతూ ప్రజలు జిల్లాను మొత్తంగా కరువు ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ రామడుగు, గంగాధర, గన్నేరువరం మండలాలు మినహా
ప్రభుత్వం రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు ఉన్నట్లుగా గుర్తించి మంగళవారం జీవోఎంఎస్ నంబరు 3ను జారీ చేసింది. ఇందులో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ మండలాలను మాత్రమే మధ్యస్త కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే కరువు సహాయక చర్యలు ఈ మండలాలకే పరిమితమవుతాయి. జిల్లాలో జూన్ 1 నుంచి 28 అక్టోబరు వరకు సగటున 810.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 681.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లా అధికారిక నివేదికల ప్రకారం హుజురాబాద్ మండలంలో మైనస్ 42 శాతం, వీణవంకలో మైనస్ 40, ఇల్లందకుంటలో మైనస్ 35, జమ్మికుంటలో మైనస్ 33, కొత్తపల్లిలో మైనస్ 28, కరీంనగర్ రూరల్‌లో మైనస్ 22, కరీంనగర్ అర్బన్‌లో మైనస్ 20, తిమ్మాపూర్, శంకరపట్నంలో మైనస్ 15, చొప్పదండిలో మైనస్ 13శాతం, మానకొండూర్‌లో మైనస్ 11శాతం, సైదాపూర్‌లో మైనస్ 8శాతం, చిగురుమామిడిలో మైనస్ 5 శాతం వర్షపాతం నమోదైంది. రామడుగు మండలంలో సాధారణ వర్షపాతానికంటే 29శాతం, గంగాధర, గన్నేరువరం మండలాల్లో 10 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
ఫ వర్షపాతాలను ఆధారంగా చేసుకుని..
ప్రభుత్వం కరువు మండలాల ప్రతిపాదనలు కోరినప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కరీంనగర్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ మండలాలను మాత్రమే మోడరేట్ (మధ్యస్త) కరువు మండలాలుగా గుర్తించారు. నిబంధనల ప్రకారం 19 శాతం లోటు నుంచి 19 శాతం అధికం వరకు సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. ఈ మేరకు జిల్లాలోని గంగాధర, చొప్పదండి, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో సాధారణ వర్షపాతం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట, కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో లోటు వర్షపాతం, రామడుగులో అధిక వర్షపాతం కురిసిన మండలాలుగా గుర్తించారు. సాధారణ వర్షపాతం నమోదైన గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలు జిల్లాలో మెట్ట ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతుకు భూగర్భజ లాలు పడిపోవడం ప్రతియేటా జరిగేదే. రాబోయే రోజుల్లోనూ అదేపరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. యాసంగిలో వరి సాగు చేయవద్దని సూచిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ భూములను వరి, పత్తి పంటలకు మాత్రమే అనుకూలంగా రైతులు మార్చుకున్నారు. వేరే పంటలు సాగు చేసినా దిగుబడి వచ్చేది అనుమానమే.
ఫ ధర్నాలు... ఆందోళనలు :
జిల్లాలోని వీణవంక, మానకొండూర్, ఇల్లందకుంట, చిగురుమామిడి మండలాల్లో ఆయా మండలాల బీజేపీ శాఖల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి తహసీల్దార్లకు తమ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ వినతిప్రతం సమర్పించారు. సైదాపూర్ మండలంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఫ కరువు మండలాల గుర్తింపుపై కేంద్రమంత్రి ఆగ్రహం..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాపై అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటిని అశాస్త్రీయంగా ఎంపికచేశారని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకుఅన్యాయం చేస్తే తీవ్రపరిణామాలు తప్పవని బండిసంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫఅశాస్త్రీయంగా కరువు మండలాల ప్రకటన
పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి
జిల్లామొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అశాస్త్రీయంగా కరువు మండలాలు ప్రకటించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. కరీంనగర్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ మండలాలను మాత్రమే ఏ ప్రాతిపదికన కరువు మండలాలుగా ప్రకటించారో అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రీసర్వే నిర్వహించి పారదర్శకంగా నివేదికలు తయారు చేసి కరువు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్‌నినో తో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలని కోరారు.