గాంధీని చంపిన గాడ్సేను పొగిడింది బీజేపీనే
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:41 AM
శాసనసభలో గాంధీ వర్సెస్ గాడ్సేపై మంత్రులు, బీజేపీ నేతల మధ్య మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది. వీబీజీరామ్‌జీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి హామీ రోజుల సంఖ్య పెరిగిందని బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.
గాడ్సే... ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు
మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, వాకిటి, పొన్నం
అవును.. గాంధీని చంపింది గాడ్సేనే..
కానీ ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేదు: ఏలేటి
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో గాంధీ వర్సెస్ గాడ్సేపై మంత్రులు, బీజేపీ నేతల మధ్య మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది. వీబీజీరామ్‌జీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి హామీ రోజుల సంఖ్య పెరిగిందని బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రలో గాంధీ పేరును తుడిచే ప్రయత్నంలో భాగంగానే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ సర్కారు మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రపంచమంతా పొగిడే త్యాగమూర్తి గాంధీని ఆర్‌ఎస్‌ఎస్ నేత గాడ్సే కాల్చి చంపారని ఆమె ఆరోపించారు. గాడ్సేకు నివాళులర్పించిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకిచ్చినట్లు తెలంగాణకు కేంద్ర నిధుల వాటా ఇచ్చిందని, ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదన్నారు. పొరుగున ఉన్న ఏపీ నిధులు తీసుకెళ్తుంటే.. మన ఎంపీలు ముద్దపప్పుల్లా ఉన్నారని పొన్నం విమర్శించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గాంధీని చంపిన గాడ్సేను పొగిడింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 12 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు పన్నుల రూపేణా కేంద్రానికి రూ.60 లక్షల కోట్లు చెల్లించారని, రాష్ట్రానికి పన్నురూపేణా రావాల్సిన నిధులపై రాద్ధాంతం చేయడమేంటని మండిపడ్డారు. అయితే తాను బడ్జెట్‌పై లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేకనే అధికార కాంగ్రెస్ నేతలు గాంధీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఏలేటి ఆక్షేపించారు. గాంధీని హత్య చేసింది గాడ్సేనని, కానీ ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టింది చీటింగ్ బడ్జెట్, మోసపూరిత బడ్జెట్ అని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌లో అనేక తప్పిదాలున్నాయని, నిరూపించడానికి సిద్ధం అని ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ తరపున ఆయన మాట్లాడారు. బడ్జెట్‌పై ఏలేటి వ్యాఖ్యలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తప్పుపట్టారు. నాలుగు కోట్ల ప్రజలతో ముడిపడిన బడ్జెట్‌ను ఏ విధంగా చీటింగ్ బడ్జెట్ అంటారని ఆక్షేపిస్తూ.. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
శాసనసభకు ఐదుగురు మంత్రులే హాజరు!
శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా తప్పకుండా పాల్గొనాలని, అవసరమైతే హాజరు కూడా తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెబుతున్నా.. సభ్యుల్లో మాత్రం మార్పు రావడంలేదు. మంగళవారం ఉదయం 10.05 గంటలకు సభ ప్రారంభమవగా, 11 గంటల వరకు, అంటే దాదాపు గంట పాటు సభలో 5 గురు మంత్రులతో పాటు కొద్దిమంది అధికార, ప్రతిపక్ష సభ్యులు మాత్రమే ఉన్నారు.