Share News

బీసీ రిజర్వేషన్ల కోసం అడుక్కోవాలా?

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:54 AM

బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌...

బీసీ రిజర్వేషన్ల కోసం అడుక్కోవాలా?

  • ఇచ్చిన హామీలు అమలు చేయరా?: తలసాని

  • అడుక్కోం.. బరాబర్‌ కొట్లాడతాం: మంత్రి వాకిటి

  • మీ హయాంలో ఆ ఆలోచన చేయలేదేం?: సీతక్క

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్ర జ్యోతి): బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీసీ పద్దుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం అడుక్కునే పరిస్థితి ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తలసాని మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా బీసీ సంక్షేమం కోసం బడ్జెట్‌లో ఏటా రూ.20 వేల కోట్లు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కాగా, బీఆర్‌ఎస్‌ నేత తలసాని చేసిన వ్యాఖ్యలను మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. రిజర్వేషన్ల కోసం బీసీలు అడుక్కునే స్థితిలో లేరని.. సీనియర్‌ నాయకుడు అయిన తలసాని అలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం పని చేస్తోందన్నారు. ఎవరిని అడుక్కునేది లేదని.. బీసీల హక్కుగా బరాబర్‌ 42 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడతామని స్పష్టం చేశారు. ఇదే విషయమై మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ నేత రాహుల్‌గాంధీ అని చెప్పారు. బీసీలకు మంచి చేయాలని ఒక ప్రయత్నం చేశామని.. బీఆర్‌ఎ్‌సకు ఆ ఆలోచన కూడా లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 27 , 2026 | 03:54 AM