Telangana Assembly: నేడు అసెంబ్లీలో హిల్ట్‌పై చర్చ
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:29 AM
హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు (హిల్ట్) విధానంపై సోమవారం శాసనసభలో కీలక చర్చ జరగనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, భూవినియోగ విధానాలపై ప్రభావం చూపుతున్న హిల్ట్ విధానంలో ...
హైదరాబాద్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు (హిల్ట్) విధానంపై సోమవారం శాసనసభలో కీలక చర్చ జరగనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, భూవినియోగ విధానాలపై ప్రభావం చూపుతున్న హిల్ట్ విధానంలో ప్రతిపాదిత సవరణలు చర్చలో ప్రధాన అంశంగా ఉండనున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక పార్కుల్లోని భూముల వినియోగం, కన్వర్షన్ ఫీజు, కంపెనీల సమస్యలపై ఇటీవల పారిశ్రామికవేత్తలు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హిల్ట్ పాలసీపై ప్రభుత్వం జీవో నెం 27ను గత ఏడాది నవంబరు 22న విడుదల చేయగా.. 45 రోజులు కావస్తున్నా భూ వినియోగ మార్పు కోసం దరఖాస్తులేమీ రాలేదని విశ్వసనీయ సమాచారం. ఓఆర్‌ఆర్ వెలుపలికి వెళ్తే నూతన పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, ఆ కారణంగానే తాము సందిగ్ధంలో ఉన్నామని పలువురు పారిశ్రామికవేత్తలు ఇటీవల నిర్వహించిన సదస్సుల్లో పేర్కొన్నారు. దాంతో సోమవారం శాసనసభలో చర్చకు రాబోయే హిల్ట్ పాలసీలో ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా లేదా అని పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్తలు కోరుతున్నట్లు కొత్త మార్గదర్శకాలు చేర్చబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ విధానాన్ని ప్రతిపక్షాలు లక్షల కోట్ల స్కాంగా ఆరోపించగా, ప్రభుత్వం కూడా దీటుగానే సమాధానమిచ్చింది. ఈ ప్రక్రియ బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందంటూ ఆరోపణలను తిప్పికొట్టింది. ‘వారు చేస్తే పాలన.. మేము చేస్తే స్కాం ఎలా అవుతుంద’ని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. తాము కేవలం యాజమాన్య హక్కులు ఉన్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. హిల్ట్ విధానం మూతపడిన పరిశ్రమల యజమాన్యాలకు మాత్రమే ఉపయోగకరమని పలువురు పారిశ్రామికవేత్తలు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఉన్న పళంగా మరో చోటుకు తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ప్రభుత్వం మొదట ఓఆర్‌ఆర్ అవతల పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు. దానికి తోడు భూవినియోగ మార్పు తప్పనిసరి కాదని చెప్పడంవల్ల కూడా పారిశ్రామికవేత్లల్లో మరింత గందరగోళం నెలకొందన్నారు. ప్రస్తుత పారిశ్రామికవాడల్లో కొందరు వినియోగ మార్పు చేసుకుని, మరికొందరు చేసుకోకపోతే.. చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఏర్పడితే అక్కడ కొనసాగాలనుకునే పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు.