డిఫాల్ట్ మిల్లులకు డెడ్‌లైన్!
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:39 AM
డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించిన మిల్లర్ల నుంచి సొమ్ము రాబట్టేందుకు ప్రభుత్వం విధించిన 45 రోజుల గడువు ఈ
పెద్దపల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించిన మిల్లర్ల నుంచి సొమ్ము రాబట్టేందుకు ప్రభుత్వం విధించిన 45 రోజుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో జిల్లాలోని డిఫాల్ట్ మిల్లుల యజమానులపై అధికారుల నిఘా పెరిగింది. బకాయిల వసూళ్లలో భాగంగా మిల్లర్ల ఆర్థిక లావాదేవీలతోపాటు వారి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు వసూళ్లలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లాలో రూ.4.50 కోట్ల నగదుతో పాటు 317 టన్నుల సన్నబియ్యాన్ని అధికారులు రికవరీ చేశారు.
ఫ జిల్లాలో 38 డిఫాల్ట్ మిల్లులు
జిల్లాలో ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా బకాయిపడిన మిల్లులు 38 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా డిఫాల్ట్ మిల్లర్లకు 45 రోజుల గడువు ఇచ్చి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. గడువు ముగియడానికి వారం రోజులే సమయం ఉండటంతో అధికారులు వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశారు. మిల్లుల వారీగా బకాయిల వివరాలను పరిశీలిస్తూ చెల్లింపులపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఫ రికవరీలో జిల్లా ముందంజ
ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన వసూళ్ల ప్రక్రియలో జిల్లా పురోగతి సాధించింది. ఈ నెల 22వ తేదీ వరకు జిల్లాలోని డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.4.50 కోట్ల నగదును వసూలు చేయడంతో పాటు 317 టన్నుల సన్నబియ్యాన్ని రికవరీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.12.50కోట్లకు పైగా నగదు వసూలైనట్లు తెలుస్తోంది. ఇందులో పెద్దపల్లి జిల్లా నుంచే అత్యధికంగా రూ.4.50 కోట్లు వసూలు కావడం గమనార్హం. సుమారు రూ.3 కోట్ల వసూళ్లతో భద్రాద్రి జిల్లా, రూ.2 కోట్లతో నిజామాబాద్ జిల్లా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నగదు వసూళ్లతో పాటు బియ్యం రికవరీలోనూ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఫ మిల్లర్ల ఆస్తులపై నిఘా
బకాయిల వసూళ్లలో భాగంగా అధికారులు కేవలం మిల్లులకే పరిమితం కాకుండా యజమానుల ఆస్తుల వివరాలపైనా దృష్టి సారించారు. మిల్లర్ల పేరిట ఉన్న భూములు, భవనాలు, ఇతర స్థిరాస్తుల వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైన చోట కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. బకాయిలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, ఇతర పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్‌లో భాగంగా మిల్లుల్లోని నిల్వలు, రికార్డులను పరిశీలిస్తూ బకాయిలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.
ఫ గడువు తర్వాత కఠిన చర్యలు!
ప్రభుత్వం విధించిన 45 రోజుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో డిఫాల్ట్ మిల్లర్లలో ఆందోళన నెలకొంది. గడువులోగా బకాయిలు చెల్లించని వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బకాయిలకు అనుగుణంగా ఆస్తులను గుర్తించడం, చట్టపరమైన రికవరీ ప్రక్రియ చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇప్పటికే వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ముందున్న జిల్లాలో మిగిలిన బకాయిలను సైతం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నెలాఖరులోగా ఎంతమంది మిల్లర్లు బకాయిలు చెల్లిస్తారు? ఎంతమేర నగదు, బియ్యం రికవరీ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.