Share News

నాలాలో కుళ్లిన మృతదేహం

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:32 AM

హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలోని ఓ నాలాలో చేపట్టిన పూడిక తీత పనుల్లో ఓ మృతదేహం బయటపడింది. బాగా కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో..

నాలాలో కుళ్లిన మృతదేహం

  • పూడిక తీస్తుండగా బయటకు

  • హైదరాబాద్‌లోని అల్వాల్‌లో కలకలం

అల్వాల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలోని ఓ నాలాలో చేపట్టిన పూడిక తీత పనుల్లో ఓ మృతదేహం బయటపడింది. బాగా కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన కార్మికులు హడలిపోయారు. హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ వర్షాకాల అత్యవసర బృందం(ఎంఈటీ)... అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని మచ్చబొల్లారం మోతుకులకుంట ఔట్‌లెట్‌ నాలాలో బుధవారం పూడిక తీస్తుండగా ఈ ఘటన జరిగింది. నాలాలో మృతదేహం కనిపించడంతో హైడ్రా అధికారులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. నాలా వద్దకు చేరుకున్న అల్వాల్‌ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం 15 రోజుల క్రితం నాటిదని, ఆకుపచ్చ రంగు చీర శరీరంపై ఉందని అల్వాల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి వెల్లడించారు. అయితే, మృతదేహం ఎవరిది ? నాలాలోకి ఎలా వచ్చింది ? అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అల్వాల్‌, చుట్టు పక్కల పోలీస్‌ స్టేషన్లలో ఇటీవల నమోదైన మిస్సింగ్‌ కేసులు వివరాలు తెలుసుకుంటున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:32 AM