Share News

అర్ధరాత్రి స్పై కెమెరాతో పబ్‌కు ఒంటరిగా వెళ్లి.. డీసీపీ రితిరాజ్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:35 AM

హైదరాబాద్‌ కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ ఒంటరిగా సాహసోపేతమైన ఆపరేషన్‌ నిర్వహించారు. అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్య, అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఓ పబ్‌ ఆట కట్టించారు.

అర్ధరాత్రి స్పై కెమెరాతో పబ్‌కు ఒంటరిగా వెళ్లి.. డీసీపీ రితిరాజ్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌

  • కేపీహెచ్‌బీ పబ్‌లో నిర్వాహకుల ఇష్టారాజ్యం.. యువతులను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు

  • వారితో కస్టమర్లకు వల వేసి నిలువుదోపిడీ.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియో తీసిన డీసీపీ

  • ఆమె ఆదేశాలతో కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌పై పోలీసుల మెరుపు దాడి... మేనేజర్‌ అరెస్టు

  • పోలీసుల అదుపులో నలుగురు యువతులు సహా ఎనిమిది మంది

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ ఒంటరిగా సాహసోపేతమైన ఆపరేషన్‌ నిర్వహించారు. అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్య, అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఓ పబ్‌ ఆట కట్టించారు. రితిరాజ్‌ స్పై కెమెరాలు ధరించి అర్ధరాత్రి ఒక్కరే మఫ్టీలో వెళ్లి పబ్‌లో దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీశారు. వెంటనే ఆమె ఆదేశాలతో పోలీసులు ఉరుకులు పరుగులతో వచ్చి పబ్‌పై దాడి చేశారు. హైదరాబాద్‌లో కొన్ని పబ్‌ల నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయిలతో కస్టమర్లపై వలపు వల విసిరి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ పబ్‌లో అసభ్య, అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న డీసీపీ రితిరాజ్‌ నేరుగా రంగంలోకి దిగారు. సిబ్బందిని ఎవర్నీ తనతో తీసుకెళ్లకుండా ఒక్కరే కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌కు వెళ్లారు. స్పై కెమెరాలు ధరించి వెళ్లిన ఆమె పబ్‌లో వ్యవహారాన్ని ఫొటోలు, వీడియోలు తీశారు. పబ్‌ నిర్వాహకులు వివిధ నగరాల నుంచి యువతులను రప్పిస్తున్నట్లు డీసీపీ గుర్తించారు. కస్టమర్లను ఆ యువతులు మత్తులో ముంచి, వివిధ రకాల ఖరీదైన మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు చేయిస్తున్నారు. పబ్‌ నిర్వాహకులు ఆ యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ వారు వ్యభిచారానికి సైతం సిద్ధమన్నట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ తతంగాన్నంతా స్పై కెమెరాతో రికార్డు చేసిన డీసీపీ.. ఆ తర్వాత ప్రత్యేక పోలీసు బృందాలతో అర్ధరాత్రి పబ్‌పై దాడి చేయించారు. పబ్‌ మేనేజర్‌ను అరెస్టు చేశారు. నలుగురు యువతులను, నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


కొమ్ముకాస్తున్న స్థానిక పోలీసులు!

ఓ సాప్ట్‌వేర్‌ యువకుడికి డేటింగ్‌ యాప్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కేపీహెచ్‌బీలోని పబ్‌లో కలుద్దామని ఆమె చెప్పడంతో అతడు గత నెల 29న వెళ్లాడు. అతను రెండు పెగ్గుల విస్కీ తాగగా.. ఆమె నాలుగు పెగ్గుల విస్కీ తాగింది. చివర్లో రూ.41,606 బిల్లు చూసిన యువకుడి గుండె గుభేల్‌మంది. అంత మద్యం తాగలేదని ఎంత చెప్పినా నిర్వాహకులు వినలేదు. తనతో ఉన్న యువతిని అడగాలంటూ వెతకగా అప్పటికే ఆమె మాయమైంది. ఈ మోసంపై బాధితుడు ఫిర్యాదు చేసినా కేపీహెచ్‌బీ పోలీసులు పట్టించుకోలేదని తెలిసింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి నిత్యకృత్యమైనా, స్టేషన్‌కు కూతవేటు దూరంలో పబ్‌లో గలీజు దందా జరుగుతున్నా పోలీసులు మాత్రం పబ్‌ నిర్వాహకులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పోలీసులు నెలవారీ లంచాలకు అలవాటుపడి పబ్‌ నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated Date - Jun 08 , 2026 | 05:37 AM