Share News

డీసీసీబీలో మ్యూల్‌ ఖాతాల తనిఖీ

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:18 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)తో పాటు నల్లగొండ పట్టణంలోని సహకార బ్రాంచ్‌ సూర్యాపేట జిల్లాలోని కోదాడ, మునగాల, నల్లగొండ జిల్లాలోని నిడమనూరులోని సహకార బ్యాంకుల్లో సైబర్‌ క్రైం అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.

డీసీసీబీలో మ్యూల్‌ ఖాతాల తనిఖీ
సహకార బ్యాంకుల్లో సైబర్‌ క్రైం అధికారుల తనిఖీలు

నల్లగొండ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)తో పాటు నల్లగొండ పట్టణంలోని సహకార బ్రాంచ్‌ సూర్యాపేట జిల్లాలోని కోదాడ, మునగాల, నల్లగొండ జిల్లాలోని నిడమనూరులోని సహకార బ్యాంకుల్లో సైబర్‌ క్రైం అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వివిధ వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ పరిశీలించారు. మ్యూల్‌ అకౌంట్స్‌పై(అనుమానాస్పద ఖాతాలు) ప్రధానంగా దృష్టి సారించారు. సైబర్‌ నేరస్తులు మనీలాండరింగ్‌ చేసే వారు చట్టవిరుద్ధంగా డబ్బుల బదిలీ, ఇతర బ్యాంకు ఖాతాలు ఉపయోగించే వాటిపై దృష్టిపెట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని పలు సహకార బ్యాంకుల్లో 12 మ్యూల్‌ ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రస్థాయి అధికారుల మేరకు సైబర్‌ క్రైం అధికారులు నల్లగొండలోని డీసీసీబీలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, రామగిరిలోని సహకార బ్యాంకుల్లోనూ, ఇతర సహకార బ్యాంకులతో పాటు పలు వాణిజ్య బ్యాంకుల్లో మ్యూల్‌ ఖాతాలపై దృష్టిపెట్టారు. జిల్లాకేంద్రంలోని సహకార బ్యాంకుల్లో అధికారుల నుంచి అను మానాస్పద ఖాతా నెంబర్లు సేకరించడంతో పాటు వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన మెయిల్‌ ఐడీలకు పూర్తివివరాలు పంపాలని కోరారు. బ్యాంకు అధికారులు రాతపూర్వకంగా సైబర్‌ అధికారుల నుంచి లేఖను తీసుకొని వారు అడిగిన వివరాలన్నింటినీ పంపించారు. నేరస్తులు అకౌంట్లను ఉపయోగించి అక్రమంగా డబ్బును డిపాజిట్‌ చేయడం, విత్‌డ్రా చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులతో పాటు సైబర్‌ క్రైం అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజుల క్రితం నల్లగొండలోని ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి ఖాతా నుంచి సైబర్‌ నేరస్తులు రూ.18లక్షలు కాజేసే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో సైబర్‌ క్రైం అధికారులు అప్రమత్తం కావడంతో నగదు బదిలీ కాకుండా ఆగిపోయింది.

Updated Date - Feb 26 , 2026 | 12:18 AM