డీసీసీ అధ్యక్షుల పల్లెబాట
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:32 AM
గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు డీసీసీ అధ్యక్షులు మంగళవారం గ్రామాల బాట పట్టారు. 11 బృందాలుగా 11 గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేశారు.
ఒక్కో బృందంలో ఏడుగురు నేతలు.. 11 బృందాలుగా 11 గ్రామాల్లో పర్యటన
ఇంటింటికీ వెళ్లి కుటుంబ నేపథ్యం, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా
వికారాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు డీసీసీ అధ్యక్షులు మంగళవారం గ్రామాల బాట పట్టారు. 11 బృందాలుగా 11 గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేశారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ నేపథ్యం, వారి పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులు శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. శిక్షణలో భాగంగా వారు మంగళవారం సమీపంలోని.. ధారూరు మండలంలో కెరెల్లి, నాగసమందర్, తరిగోపుల, దోర్నాల్, వికారాబాద్ మండలంలో సిద్దులూ రు, గిరిగెట్‌పల్లి, పీలారం, ఎర్రవల్లి, మోమిన్‌పేట్ మండలంలో వెల్చాల్, పూడూరు మండలంలో మీర్జాపూర్, పూడూరు గ్రామాలను సందర్శించారు. ఉదయం గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పథ కం అమలుతీరు మొదట్లో ఎలా ఉండేది?, ఇప్పుడు ఎలా ఉందనేది అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వలస వెళ్లకుండా వారికి గ్రామాల్లోనే ఉపాధి కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చినట్టు గుర్తు చేశారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామీణ ప్రజల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయం గా ప్రజల్లో చైతన్యం ఏ మేర ఉందనేది వారు పరిశీలించారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు, కుటుంబ పోషణ ఎలా కొనసాగుతోంది? వ్యవసాయం చేస్తా రా? ఎంత భూమి ఉంది? ఏ పంటలు సాగు చేస్తా రు? ఏ మేర ఆదాయం వస్తోంది? వ్యవసాయం చేయకుంటే.. ఇతర ఉపాధి, ఉద్యోగం, ఆదాయం వివరాలు, పిల్లల చదువులు తదితర సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాము సందర్శించిన గ్రామాల్లో విద్య, వైద్యం, పశువైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, వాటిపై ప్రజల అభిప్రాయం, ఇంకా ఏం కోరుకుంటున్నారన్నది ఆరా తీశారు. తాము పరిశీలించిన అంశాలు, తమ దృష్టికి వచ్చిన సమస్యల పై డీసీసీ అధ్యక్షులు బృందాల వారీగా నివేదికలు తయారు చేసి శిక్షణ శిబిరం నిర్వాహకులకు అందజేయనున్నట్టు తెలిసింది. ఇక క్షేత్ర పర్యటన అనంతరం సాయంత్రం అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో డీసీసీ అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది.
మీర్జాపూర్‌లో మహేశ్‌గౌడ్ పర్యటన
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఉపాధి పథకం కూలీలతో సమావేశమై.. వారి సమస్యలను, విజ్ఞప్తులను తెలుసుకున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.