Share News

పగలే నీటిని పంపింగ్‌ చేయండి

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:27 AM

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకా నీటి పంపింగ్‌పై ఇంధన శాఖ, నీటిపారుదల శాఖల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇటీవలే దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలో ఉన్న దేవన్నపేట పంపింగ్‌...

పగలే నీటిని పంపింగ్‌ చేయండి

  • సౌర విద్యుత్‌తో ఖర్చు తగ్గించుకోవచ్చు

  • ఎత్తిపోతల పథకాల నీటి పంపింగ్‌పై రెండు శాఖల మధ్య కోల్డ్‌వార్‌

  • నేడు భట్టి, ఉత్తమ్‌ల సమక్షంలో సమీక్ష

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎత్తిపోతల పథకా నీటి పంపింగ్‌పై ఇంధన శాఖ, నీటిపారుదల శాఖల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇటీవలే దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలో ఉన్న దేవన్నపేట పంపింగ్‌ కోసం అవసరమైన విద్యుత్‌ను నిరాఘాటంగా అందించాలని నీటిపారుదలశాఖ ఇండెంట్‌ ఇవ్వగా.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రాన్స్‌కో బదులివ్వడంతో రెండు శాఖల మధ్య వివాదం ముదిరింది. వివిధ ఎత్తిపోతల పథకాల కింద గత ఫిబ్రవరి 28వ తేదీ నాటికి తీసిన లెక్కల ప్రకారం రూ.27,027 కోట్లు కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వ హయాంలోనూ చెల్లించాల్సిన బకాయిలు ఇవి. సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ చార్జీల రూపంలో మరో రూ.1745 కోట్లు ట్రాన్స్‌కోకు, ఇవేకాక ఎత్తిపోతల పథకాల వద్ద సబ్‌స్టేషన్లు, లైన్ల పనుల కింద రూ.4881 కోట్లు ట్రాన్స్‌కోకు కలిపి.. మొత్తం రూ.33,653 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిపారుదలశాఖ బకాయిలు చెల్లించే అవకాశం లేదు. సౌరవిద్యుత్‌ అందుబాటులో వచ్చే సమయంలోనే నీటిని పంపింగ్‌ చేసుకోవాలని ఇంధనశాఖ సూచిస్తోంది. అయితే.. వివిధ ఎత్తిపోతల పథకాల్లో వినియోగించే మోటార్లు/పంపులను పగటిపూట నడిపించి.. రాత్రిపూట ఆపడం కుదరదని, దీనివల్ల పంపులు దెబ్బతింటాయని నీటిపారుదల శాఖ పేర్కొంటోంది. ఈ అంశంపై ఈనెల 8న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఈ అంశంపై సమీక్ష జరగనుంది.

Updated Date - Apr 08 , 2026 | 05:27 AM