దావోస్ పర్యటనలతో 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:53 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులకు రెండుసార్లు హాజరై రాష్ర్టానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల ...
68,150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు:దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులకు రెండుసార్లు హాజరై రాష్ర్టానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 68,150 మందికి ఉద్యోగాలు లభించనున్నట్టు చెప్పారు. దావోస్ పర్యటనల్లో భాగంగా మొత్తం 44 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్టు వివరించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2024 పర్యటనలో 18 ఎంవోయూల ద్వారా రూ.40,232 కోట్లు, 2025లో 26 ఎంవోయూల ద్వారా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులు పెడుతున్న 6 కంపెనీలకు భూముల కేటాయించామని, తద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ఎంవోయూలు, పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పెట్టుబడులపై విపక్షాలు విష ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. దావోస్ పర్యటనలు, ఇతర సందర్భాల్లో చేసుకున్న ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పాంజ్ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని ప్రారంభించ బోతున్నట్లు ప్రకటించారు.