డీఏపీ కొరత..
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:20 AM
వానాకాలం సాగు ఊపందుకున్న తరుణంలో రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కంపెనీల నుంచి ఆశించిన మేర సరఫరా లేకపోవడంతో జిల్లాలో డీఏపీ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. మరోవైపు కొంతమంది హోల్‌సేల్ డీలర్లు ఇదే అదనుగా ఎమ్మార్పీకి మించి ఒక్కో బస్తాపై 300రూపాయల వరకు అదనంగా
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వానాకాలం సాగు ఊపందుకున్న తరుణంలో రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కంపెనీల నుంచి ఆశించిన మేర సరఫరా లేకపోవడంతో జిల్లాలో డీఏపీ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. మరోవైపు కొంతమంది హోల్‌సేల్ డీలర్లు ఇదే అదనుగా ఎమ్మార్పీకి మించి ఒక్కో బస్తాపై 300రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని రిటైల్‌ఎరువుల దుకాణాలకు డీఏపీ సరఫరా చాలా తక్కువగా జరుగుతోంది. హోల్‌సేల్ డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఆ ధరలకు కొనుగోలు చేస్తే రైతులకు ఎమ్మార్పీకి విక్రయించడం సాధ్యం కాదని పలు వురు రిటైల్ డీలర్లు చెబుతున్నారు. దీంతో వారు డీఏపీ కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది.
ఫ ఒక్కో డీఏపీ బస్తా రూ.1700కు విక్రయం..
ఒక డీఏపీ బస్తా ఎమ్మార్పీ ధర 1350రూపాయలు కాగా, హోల్‌సేల్ డీలర్లు రిటెయిల్ డీలర్లకు 1600నుంచి 1700రూపాయలకు విక్రయిస్తూ, బిల్లులు మాత్రం 1350రూపాయలకే ఇస్తున్నారని చెబుతున్నారు. ఆ ధరలకు విక్రయిస్తే రైతులు కొనుగోలు చేయరని, ఒకవేళ కొనుగోలు చేసినా సంబంధిత అధికారులకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ లైసెన్సులను రద్దు చేస్తారోనని భయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు డీఏపీ తీసుకు రావడం లేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎరువుల వ్యాపారులే కొంతమేరకు తీసుకవచ్చి, వారికి వచ్చిన ధరకే రైతులకు విక్రయిస్తున్నారని సమాచారం. తమ అవసరాన్ని బట్టి కొందరు రైతులు 1700రూపాయలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. డీఏపీ తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం, ఆయాకంపెనీలకు కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ సొమ్మును సకాలంలో విడుదల చేయకపోవడంతో దేశవ్యాప్తంగా డీఏపీ ఉత్పత్తిని తగ్గించాయి. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కాంప్లెక్‌ఎరువుల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఒక్కో బస్తా 1900నుంచి 2,250రూపాయల వరకు పెరగడంతో డీఏపీని ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో గల హోల్‌సేల్ డీలర్లు ఎమ్మార్పీకి మించి విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫ కాంప్లెక్స్ ఎరువులే దిక్కు..
డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 2,75,990 వరి, పత్తి, మొక్కజొన్న వివిధ రకాల పంటలను రైతులు పండిస్తారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 4,180మెట్రిక్ టన్నుల డీఏపీని రైతులు వినియోగించగా, ఈ సీజన్‌లో 3,767టన్నుల డీఏపీని వినియోగించనున్నారని అంచనా వేశారు. సీజన్‌ఆరంభం నాటికి జిల్లాలో 814.5 టన్నుల డీఏపీ పాత స్టాకునిల్వ ఉండగా, కొత్తగా కొంతవరకే డీఏపీ వచ్చిందని అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో పంటల సాగు తక్కు వగానే ఉన్నప్పటికీ, వర్షాలు పడతాయనే ఆశతో రైతులు ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న డీఏపీ నిల్వలు పూర్తిగా అమ్ముడు పోగా, డీఏపీకి బదులు రైతులు కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. డీఏపీ కంటే అవి ఖరీ దైనవి కావడంతో సాగువ్యయం మరింత పెరుగుతోందని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఒకవైపు విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న తమకు ఎరువుల భారం కూడా అదనంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ డీఏపీ విక్రయాలపై నిఘా ఎక్కడ?
ఎమ్మార్పీకి మించి డీఏపీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. హోల్‌సేల్ డీలర్లు ఒక్కో బస్తాను రిటెయిల్ డీలర్లకు ఎంతకు సర ఫరా చేస్తున్నారు. వాళ్లు రైతులకు ఎంతకు విక్రయిస్తున్నారనే విషయమై సంబంధిత అధికారులు నిఘా పెట్టడం లేదు. దీంతో హోల్‌సేల్ డీలర్లు ఒక టన్ను డీఏపీపై అదనంగా 3వేల రూపాయలు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. డీఏపీ అరకొరగా సరఫరా చేస్తుండడంతో కేంద్రప్రభుత్వంపై సబ్సిడీల భారం కూడా తగ్గనున్నది. డీఏపీకి బదులు కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడుతున్నది. కాంప్లెక్స్‌లో అధికంగా వాడే 28-28-0 కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులు కూడా కొరత ఉన్నాయని రైతులు తెలిపారు. సంబంధిత అధికా రులు స్పందించి డీఏపీని వందకు వందశాతం ప్రైవేట్ డీలర్లకు గాకుండా మార్క్ ఫెడ్‌కు విక్రయించాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.