Share News

Drug trafficking: విదేశాలకు కొరియర్‌లో ప్రమాదకరమైన మత్తుమందు బిళ్లలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:40 AM

విదేశాల్లో ఉండే మానసిక రోగులకు నకిలీ ప్రిస్కిప్షన్లతో ప్రమాదకరమైన మత్తుమందు బిళ్లలను కొరియర్లలో పంపుతున్న ఒక ముఠాను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో...

Drug trafficking: విదేశాలకు కొరియర్‌లో ప్రమాదకరమైన మత్తుమందు బిళ్లలు

  • ఇద్దరు నిందితుల అరెస్టు.. మత్తుబిళ్లల స్వాధీనం

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉండే మానసిక రోగులకు నకిలీ ప్రిస్కిప్షన్లతో ప్రమాదకరమైన మత్తుమందు బిళ్లలను కొరియర్లలో పంపుతున్న ఒక ముఠాను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరియర్‌ సంస్థ ద్వారా మత్తుబిళ్లలు ఎగుమతి అవుతున్నట్లు అందిన సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు ఆ కొరియర్‌ సంస్థలో శుక్రవారం తనిఖీలు చేశారు. ఒక కొరియర్‌ పార్సిల్‌లో సైక్రియాట్రిక్‌ రోగులు వాడాల్సిన 180 లోబజామ్‌- 10 అనే మందుబిళ్లలు బయటపడ్డాయి. వాటిని నిజామాబాద్‌లోని ఓ మెడికల్‌ షాపు యజమాని అనిల్‌కుమార్‌ బుక్‌ చేసినట్లు గుర్తించిన ఎన్‌సీబీ అధికారులు.. వెంటనే అతడి షాపులో తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారుల సహకారంతో సోదాలు నిర్వహించారు. అక్కడ నిల్వఉంచిన ప్రమాదకరమైన 598 సైకోట్రాపిక్‌ మత్తుబిళ్లలను స్వాధీనం చేసుకున్నారు. కొరియర్‌ కంపెనీలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ అనే వ్యక్తి చాలా కాలంగా నకిలీ ప్రిస్కిప్షన్లు తయారు చేసి అమెరికాలోని కొంతమంది మానసిక రోగులకు ఈ మందు బిళ్లలను పంపిస్తున్నట్లు తమ దర్యాప్తులో అఽధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎన్‌సీబీ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 11 , 2026 | 03:40 AM