kumaram bheem asifabad‘అమ్మ’కు ఆపద
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:02 PM
పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులకు రక్తహీనత శాపంగా మారుతోంది. పౌష్టికాహారలోపం, అవగాహన రాహిత్యంతో గిరిజన ప్రాం తాల్లోని గర్భిణులు, బాలింతలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పౌష్టికాహారం సరఫరా చేస్తున్నా.. వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నా అనీమియాకు పరిష్కారం దొరకడం లేదు.
ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఎనీమియా
- తగ్గుతున్న హిమోగ్లోబిన్ స్థాయి
- ఆరు నెలల్లో 2,343 మంది బాధితుల గుర్తింపు
ఆసిఫాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులకు రక్తహీనత శాపంగా మారుతోంది. పౌష్టికాహారలోపం, అవగాహన రాహిత్యంతో గిరిజన ప్రాం తాల్లోని గర్భిణులు, బాలింతలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పౌష్టికాహారం సరఫరా చేస్తున్నా.. వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నా అనీమియాకు పరిష్కారం దొరకడం లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ప్రతీ పది మంది మహిళల్లో ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే బాలింత మరణాల్లో 70 శాతానికి రక్తహీన తే కారణమవుతోందని పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
- గిరిజన మహిళల్లోనే అధికం..
జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళల్లో అనీమియా సమస్య ఎక్కువగా వేధిస్తోంది. పౌష్టికాహారం అందుబాటులో లేకపోవడం, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం, అవగాహన లోపం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. కొందరు మహిళలు ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించు కోకుండా ఇంటిపనుల్లో నిమగ్నమవుతుండడంతో సమస్య తీవ్రమవుతోంది. గర్భధారణ సమయంలో రక్తహీనత ఉంటే నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. గర్భి ణులు రక్తహీనతను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- జాగ్రత్తలు తప్పనిసరి..
వైద్యులు సూచించిన ఆహారం తీసుకుంటే రక్తహీన తను అధిగమించవచ్చు. ఐర న్‌అధికంగా ఉండే తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు బెల్లం, వేరుశెనగలు, నువ్వులు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష తీసుకోవాలి. వీలైతే చికెన్, లివర్, గుడ్లు తీసు కోవడం ద్వారా పోషకాహారం లభిస్తుంది. విటమిన్ సీ కోసం నిమ్మ జాతి పండ్లు, ఉసిరి వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలోనూ గర్భిణులకు పీహెచ్‌సీల ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ వారికి గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్నవారికి పీహెచ్‌సీల్లోనే ఐరన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అమ్మ ఒడి వాహనాల ద్వారా ఎంసీహెచ్ ఆస్పత్రులకు తరలిస్తూ నిత్యం పరీక్షలు చేయిస్తున్నారు. ప్రసవమయ్యే వరకు సమీపంలో ఉండే ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 8,591 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. ఇందులో ఆరు నెలల్లో 2,343 రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 159 మందిలో హిమోగ్లోబిన్ 7నుంచి 9గ్రాముల మధ్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే గర్భంలోని శిశువుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. తక్కువ హిమో గ్లోబిన్‌ఉన్న వారిపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సరైన పోషకా హారం అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఆహారపు అలవాట్లు, వరుస గర్భధారణలు తదితర కారణాలతో మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
నిత్యం పరీక్షలు చేయించుకోవాలి..
-నాగేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
కిడ్నీ. తలసేమియా, ఇతర వ్యాధులు ఉన్న వారిలో అధికంగా రక్తహీనత ఏర్పడుతుంది. గర్భిణులు, బాలింతలకు 7 శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే నిత్యం ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారంతోపాటు ఇంట్లోనూ సరైన ఆహా రం తీసుకుంటే ఎనిమియాను అధిగమించవచ్చు.