రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ:దానం
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:52 AM
బీఆర్‌ఎస్ ఇంకా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, వారు తీసుకునే చర్యకు తన ప్రతిచర్య ఉంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
బంజారాహిల్స్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఇంకా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, వారు తీసుకునే చర్యకు తన ప్రతిచర్య ఉంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రస్తుతం తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేనని, అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం నాగేందర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు ఏ పార్టీ ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అని బదులిచ్చారు. ఇక, శాసనసభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తన తరఫున తన అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తనకు చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే, స్పీకర్‌కు పంపిన లేఖలో అడ్వకేట్ ఏం వివరణ రాశారో తనకు తెలియదని దానం.. పూర్తి సమాచారం వచ్చాక స్పందిస్తానని చెప్పారు. ఎన్నికలకు తాను ఎప్పుడూ భయపడలేదని, ఆసి్‌ఫనగర్ లాంటి నియోజవర్గంలో ఎంఐఎంను కాదని ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు.