Share News

Dalit Workers: గుర్తింపు లేక.. చాన్నాళ్లుగా గల్ఫ్‌ జైల్లో..

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:31 AM

ఉపాధి కోసం పద్దెనిమిదేళ్ల క్రితం గల్ఫ్‌లో అడుగుపెట్టిన ఆ దళిత కూలీ, తాను భారతీయుడనని రుజువు చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వదేశానికి రాలేక....

Dalit Workers: గుర్తింపు లేక.. చాన్నాళ్లుగా గల్ఫ్‌ జైల్లో..

  • ఓ దళిత కూలీ అవస్థ.. 18 ఏళ్ల క్రితం నిర్మల్‌ నుంచి గల్ఫ్‌కు

  • ఎలాంటి గుర్తింపు కార్డు లేక స్వదేశానికి రాలేక ఇక్కట్లు

  • భర్తను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్న భార్య

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉపాధి కోసం పద్దెనిమిదేళ్ల క్రితం గల్ఫ్‌లో అడుగుపెట్టిన ఆ దళిత కూలీ, తాను భారతీయుడనని రుజువు చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వదేశానికి రాలేక, అక్కడ పనికూడా చేసుకునే వీలు లేక కొన్ని నెలలుగా జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ పద్దెనిమిదేళ్లలో అతడు ఎన్నడూ స్వదేశానికి వెళ్లలేదు. భార్యాపిల్లలను చూడలేదు. వృద్ధాప్యదశలోనైనా తనను కుటుంబసభ్యుల దరికి చేర్చాలని వేడుకుంటున్నాడు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం మాధపురం గ్రామానికి చెందిన ముందల రాజన్న (59) దీనగాథ ఇది. ‘బంగారం-మస్కట్‌ మిత్తి’ అనేది ఒకప్పుడు గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే కార్మికులకు ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ఓ వెసులుబాటు. చేతిలో చిల్లిగవ్వలేని రాజన్న 2007లో ఇలానే తెలిసిన వారిని కలిశాడు. గల్ఫ్‌ వెళ్లేందుకు వారి నుంచి నాలుగు తులాల బంగారం, రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు.. కొంతకాలానికి నాలుగు తులాల బంగారానికి ఆరు తులాలు, రూ.లక్షకు రూ.లక్షన్నర ఇస్తానని వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ బంగారాన్ని కుదువపెట్టి, వచ్చిన ఆ డబ్బుతో, చేతిలో ఉన్న రూ.లక్షతో గల్ఫ్‌ వచ్చాడు. ఓ కంపెనీలో పనికి కుదిరాడు. తన పాస్‌పోర్టును ఆ కంపెనీకి అప్పగించాడు. కొంతకాలానికి వేతన సమస్య కారణంగా కంపెనీ నుంచి పారిపోయి బయట అక్రమంగా కూలి పనులు చేసుకున్నాడు. వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు. స్వదేశానికి డబ్బు పంపి పిల్లలనూ పోషించుకున్నాడు. తర్వాత అక్కడి అధికారులు, రాజన్నను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రాజన్న జాతీయత గుర్తింపు సమస్యల నెలకొనడంతో పాస్‌పోర్టుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.


కారణం.. రాజన్య పనిచేసిన కంపెనీ 2019లోనే మూతపడింది. రాజన్య జాతీయత గుర్తింపు విషయమై కొన్నినెలలుగా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపీ జరిపీ అలిసిపోయానని, ఎలాంటి ఫలితం లేకపోయిందని అబుదాబిలోని సామాజిక కార్యకర్త గడ్చంద నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారతీయుడనని రుజువు చేసుకునేలా రాజన్న వద్ద ఎలాంటి గుర్తింపు కార్డూ లేదు. 2007లో ఆధార్‌ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టకపోవడంతో ఆయనకు ఆ గుర్తింపు కార్డూ లేదు. అప్పట్లో ఇమిగ్రేషన్‌లో బయోమెట్రిక్‌ విధానం అమల్లో లేకపోవడంతో ఆ నమోదూ జరగలేదు. రాజన్న ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. స్వదేశానికి వెళ్లి.. కూతురు నిఖితకు పెళ్లి చేయాలని రాజన్న తాపత్రయపడుతున్నాడు. ఇందుకు భారతీయుడనని తాను రుజువు చేసుకునేందుకు ‘ప్రత్యేక ట్రావెలింగ్‌ డాక్యుమెంట్‌’ ఇప్పంచాలని అతడు వేడుకుంటున్నాడు. రాజన్నను జైలు నుంచి విడిపించి, స్వదేశానికి పంపాలని అతడి భార్య లక్ష్మి, తెలంగాణలో ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. గల్ఫ్‌లో ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్న కూలీల్లో, దళితులే ఎక్కువగా ఉన్నారని, కొందరు మహిళలూ ఉన్నారని ఎన్నారై వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి పేర్కొన్నారు. రాజన్న కోసం స్వదేశంలో అతడి భార్య పోరాడుతోంది. అయితే కొందరు బాధితుల విషయంలో స్వదేశంలో నా అనేవాళ్లే కరువయ్యారు. కన్న తల్లిదండ్రులు చనిపోవడం, భార్య మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో వారి తరఫున ఆరా తీసేవాళ్లు కూడా లేకుండాపోయారు.

Updated Date - Jan 07 , 2026 | 07:59 AM