అనుమతి లేకుండా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల విక్రయం
ABN , Publish Date - May 19 , 2026 | 05:35 AM
ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి డైరీ ఫామ్ యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న...
డెయిరీఫామ్ నిర్వాహకుడి అరెస్ట్, పరారీలో ఇద్దరు నిందితులు
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి డైరీ ఫామ్ యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నిందితుడిని శంషాబాద్ టాస్క్‌ఫోర్స్, పహాడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 50 వేల విలువైన 173 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంఖాల్ గ్రామానికి చెందిన అత్తెని కృష్ణ(45) పదో తరగతి వరకు చదివి డైరీ ఫామ్ వ్యాపారం చేయడంతో పాటు తుక్కుగూడలో ‘శ్రీకృష్ణ క్యాటిల్ ఫీడ్’ పేరుతో పశుగ్రాస దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడికి గుజరాత్‌కు చెందిన ఖాలేద్ అలీ అలియాస్ చత్రుసింగ్‌తో పరిచయం ఏర్పడింది. గుజరాత్ నుంచి రూ. 50కే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను సరఫరా చేస్తానని చెప్పడంతో అతడి వద్ద పెద్ద మొత్తంలో ఇంజక్షన్లను కొనుగోలు చేసి, సమీపంలోని డెయిరీఫామ్ నిర్వాహకులకు రూ.250 నుంచి రూ.300కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతడి వద్ద తుక్కుగూడలో డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్న సురేష్ తరచూ ఇంజక్షన్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ అక్రమ విక్రయాలపై సమాచారమందుకున్న శంషాబాద్ టాస్క్‌ఫోర్స్, పహాడిషరీఫ్ పోలీసులు కృష్ణ నిర్వహిస్తున్న డెయిరీఫామ్‌పై దాడి చేసి అరెస్టు చేశారు.