సైబర్ మోసాలకు సహకరించిన ఏడుగురు బ్యాంక్ అధికారుల అరెస్టు
ABN , Publish Date - May 01 , 2026 | 05:07 AM
సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రాక్‌డౌన్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఐదు వేర్వేరు కేసుల్లో ...
‘క్రాక్‌డౌన్’ పేరిట సైబరాబాద్ పోలీసుల చర్య
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రాక్‌డౌన్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఐదు వేర్వేరు కేసుల్లో మొత్తం ఏడుగురు బ్యాంకు అధికారులను అరెస్టు చేశామని సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో.. ఇండియన్ బ్యాంక్ కూకట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ ముదావత్ దినేష్ చౌహాన్, అసిస్టెంట్ మేనేజర్ అనూష, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రగతినగర్ శాఖ మాజీ మేనేజర్ నదీష్ సాంబర్, బంధన్ బ్యాంక్ మాజీ ఫీల్డ్ ఆఫీసర్ రేణికుంట మహేష్, ఇండస్ ఇండ్ బ్యాంక్ జేఎన్‌టీయూ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రెడ్డి హరీష్, బ్యాంక్ సేల్స్ మేనేజర్ ఎన్. రవి, హైదరాబాద్‌లోని మరో బ్యాంకుకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ గొనేల సాయి వెంకట్ ఉన్నారని తెలిపారు. వీరంతా సైబర్ నేరగాళ్ల కోసం బ్యాంక్ ఖాతాలు తెరవడంలో కీలక పాత్ర పోషించినట్టు తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ పేర్కొన్నారు. ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నప్పటికీ వాటిని గుర్తించి నివేదించాల్సిన బాధ్యతను విస్మరించినట్లు తేలిందన్నారు.