రోజుకు సరాసరి కోటి లూటీ!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:19 AM
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. అదే వేగంతో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ...
సైబరాబాద్ పరిధిలో 111 రోజుల్లో 781 సైబర్ క్రైం కేసులు
204 మంది అరెస్టు.. 13 కోట్లు రికవరీ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. అదే వేగంతో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం 111 రోజుల్లో 781 సైబర్ నేరాల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసుల్లో సైబర్ నేరగాళ్లు సుమారు రూ.128 కోట్లకు పైగా ప్రజల నుంచి దోచుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున కోటి రూపాయల మేర మోసాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రజలు ‘మీ పెట్టుబడికి తక్కువ సమయంలో భారీ లాభాలు’ అంటూ వచ్చే మోసపూరిత ఆఫర్ల వలలో పడుతున్నారు. సైబర్ క్రైం విభాగం పోలీసులు ఇప్పటి వరకు 121 కేసుల్లో 204 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్టు చేసి, సుమారు రూ.13 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇప్పించారు. కొందరు నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి పట్టుకున్నారు. దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ప్రకారం విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలే ఎక్కువగా సైబర్ మోసాలకు గురవుతున్నారు. షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసగాళ్లు నమ్మకం కల్పించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్టు, కస్టమర్ కేర్ పేరిట మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ స్కామ్‌లు కూడా పెరుగుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటీపీలు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఎర వేసి నిలువుదోపిడీ చేస్తున్నారు. భారీ లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. తెలియని యాప్‌లు, వెబ్‌సైట్లు, అపరిచితులను నమ్మవద్దు’ అని డీసీపీ టీ సాయి మనోహర్ సూచించారు.