Share News

పోగొట్టుకున్న సొమ్ము సులభంగా వెనక్కి

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:51 AM

సైబర్‌ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన వారు ఆ డబ్బును తిరిగి పొందేందుకు ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.

పోగొట్టుకున్న సొమ్ము సులభంగా వెనక్కి

  • సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్‌ అయిన నగదు రికవరీకి ‘మనీ రీస్టోరేషన్‌ మాడ్యూల్‌’

  • ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ

  • ఆన్‌లైన్‌లోనే డబ్బు రిఫండ్‌ ప్రక్రియ

  • పోలీసులు, కోర్టులు, బ్యాంకుల చుట్టూ బాధితులు తిరగకుండా కొత్త విధానం

  • కోర్టు ఆదేశాలు లేకుండానే 50వేల లోపు సొమ్ము వెనక్కి

  • 1930కు ఫిర్యాదు చేయడం తప్పనిసరి

హైదరాబాద్‌ సిటీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): సైబర్‌ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన వారు ఆ డబ్బును తిరిగి పొందేందుకు ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. బాధితులు తమ సొమ్ము కోసం పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు, బ్యాంకులు చుట్టూ తిరిగే పనిని తగ్గిస్తూ... ‘మనీ రీస్టోరేషన్‌ మాడ్యూల్‌’ (ఎంఆర్‌ఎం) పేరుతో ఓ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సైట్‌ ద్వారా బాధితులు తమ ఇంటి నుంచి లేదా ఆన్‌లైన్‌లో తమ రిఫండ్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసిన (ఫ్రీజ్‌ చేసిన) నగదును బాధితులకు తిరిగి అందించేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) ఈ ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. సైబర్‌ మోసానికి గురైన తర్వాత సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ ‘1930’కు ఫోన్‌ చేసి లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో ఫిర్యాదు చేసిన వారే ఎంఆర్‌ఎం సేవలను వినియోగించుకునేందుకు అర్హులు. నిజానికి, ఎన్‌సీఆర్‌పీ లేదా 1930కి ఫోన్‌ చేసి సైబర్‌ నేర బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారులు సంబంధిత బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌(స్తంభింప) చేస్తారు అయితే, ఆ ఖాతాల్లోని తమ డబ్బును తిరిగి పొందేందుకు బాధితులు.. పోలీసులు, బ్యాంకు అధికారులు, న్యాయస్థానాలతో సమన్వయం చేసుకోవాలి.


అయితే, కొత్త విధానంలో బాధితులు తమ ఫిర్యాదు నమోదు అనంతరం నగదు రికవరీ ప్రక్రియను ఎంఆర్‌ఎం పోర్టల్‌లో సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు 14 అంకెల ఎన్‌సీఆర్‌పీ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ తోపాటు, మోసగాళ్ల బ్యాంకు ఖాతాలో ఉన్న బాధితుడి డబ్బు విజయవంతంగా ఫ్రీజ్‌ అయి ఉండడం తప్పనిసరి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 వేల వరకు ఉన్న మొత్తాలను బ్యాంకుల సమన్వయంతో తిరిగి చెల్లించే ప్రక్రియలో కోర్టు లేదా పోలీసు ఉత్తర్వులు అవసరం లేదు. రూ.50 వేలకుపైగా ఉన్న మొత్తాలకు మాత్రం పోలీసు ఫిర్యాదు, కోర్టు ఉత్తర్వులు వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే పోలీసు స్టేషన్‌లో ధ్రువీకరణ ప్రక్రియా పూర్తి చేసుకోవాలి.


ఎంఆర్‌ఎం వినియోగం ఇలా..

సైబర్‌ నేర బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్న మొబైల్‌ నంబర్‌ ఆధారంగా ఎంఆర్‌ఎం పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి.. 14 అంకెల ఫిర్యాదు నంబర్‌తో ఫిర్యాదు వివరాలను ధ్రువీకరించాలి. అనంతరం సంబంధిత బ్యాంకు ఖాతాలను ఎంపిక చేసి, అవసరమైన పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. రిఫండ్‌ జమ చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన అనంతరం ‘ఎంఆర్‌’తో ప్రారంభమయ్యే ప్రత్యేక ట్రాకింగ్‌ నంబర్‌ వస్తుంది. బాధితులు ఆ నంబర్‌ ద్వారా తమ దరఖాస్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. పూర్తిగా ఉచితమైన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటే.. సైబర్‌ నేర బాధితులు.. మోసానికి గురయ్యామని తెలుసుకున్న వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కాగా, సైబర్‌ మోసాలకు గురైన బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎంఆర్‌ఎంతో పాటు బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్‌ అయిన వాటిని ఆన్‌ ఫ్రీజ్‌ చేసేందుకు గ్రీవెన్స్‌ రీడ్రెస్సల్‌ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 05:52 AM