బిజినెస్ లోన్ పేరుతో సైబర్ మోసం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:10 AM
బిజినెస్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ కంపెనీ యజమాని బ్యాంకు ఖాతా వివరాలను తీసుకొని, ఆ ఖాతాను తన నేరాల కోసం(మ్యూల్ ఖాతా) వాడుకున్నాడు ఓ సైబర నేరగాడు.
ఓ కంపెనీ ఓనర్ ఖాతా తీసుకొని సైబర్ నేరాలు
2 కోట్ల మేర లావాదేవీలు.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): బిజినెస్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ కంపెనీ యజమాని బ్యాంకు ఖాతా వివరాలను తీసుకొని, ఆ ఖాతాను తన నేరాల కోసం(మ్యూల్ ఖాతా) వాడుకున్నాడు ఓ సైబర నేరగాడు. అలా సుమారు రూ.2కోట్ల వరకు అక్రమ లావాదేవీలు చేశాడు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన బ్యాంకు.. ఆ ఖాతాను ఫ్రీజ్ చేస్తేగానీ కంపెనీ యజమానికి ఈ విషయం తెలియలేదు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుడు సైబర్ కైరమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితుడు రెండు కంపెనీలకు యజమాని. ఆ కంపెనీల లావాదేవీల కోసం ఆర్బీఎల్ బ్యాంకులో అకౌంట్లు తెరిచాడు. 2025, జూలై నెలలో ధర్మరపు వెంకన్న అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించి, బిజినెస్ లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం కంపెనీ బ్యాంక్ ఖాతా నిర్వహణ వివరాలు(యాక్సెస్) కావాలని అడిగాడు. అతడి మాటలు నమ్మి బాధితుడు ఆ వివరాలను అందజేశాడు. తరువాత తనకు తెలియకుండా ఆ ఖాతా నుంచి రూ.2కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనకు తెలియకుండా ఖాతా దుర్వినియోగం జరిగిందని వాపోయాడు. ముంబైకి చెందిన వెంకన్నపై మోసం, సైబర్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.