Share News

సైబర్‌ నేరగాళ్ల వెనుక బెట్టింగ్‌ మాఫియా

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:20 AM

సైబర్‌ నేరగాళ్ల విస్తృత నెట్‌వర్క్‌ పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 1.0, 2.0లో సుమారు ....

సైబర్‌ నేరగాళ్ల వెనుక బెట్టింగ్‌ మాఫియా

  • కొల్లగొడుతున్న సొమ్ము ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ ఖాతాల్లోకి మళ్లింపు

  • క్రిప్టో రూపంలో చైనాకు డబ్బు

  • హైదరాబాద్‌ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

  • మ్యూల్‌ ఖాతాలు ఇచ్చిన వారికే బేడీలు

  • విదేశాల్లో ఉండి దోచుకుంటున్న నేరస్థులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్ల విస్తృత నెట్‌వర్క్‌ పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 1.0, 2.0లో సుమారు 160 మంది నేరస్థులను అరెస్టు చేశారు. వారు దేశవ్యాప్తంగా 2000 సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీనికోసం వెయ్యి వరకు మ్యూల్‌ ఖాతాలను వినియోగించినట్లు తెలిసింది. ఆ ఖాతాల్లోని ఆన్‌లైన్‌ లావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొల్లగొట్టిన డబ్బును క్రిమినల్స్‌.. క్షణాల్లోనే సుమారు 20-30 ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. వాటిలో మొదటి, రెండు విడతల్లో క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశీ ఖాతాలకు తరలిస్తున్నారు. తర్వాత దశల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ మాఫియా చేతుల్లో ఉన్న ఖాతాల్లోకి పంపిస్తున్నారు. ఈ దశల్లో డబ్బులు జమ అయిన బ్యాంకు ఖాతాదారులను పోలీసులు విచారించగా.. వారు ఎలాంటి సైబర్‌ నేరాలు చేయలేదని తేలింది. డబ్బు గురించి ఆరా తీయగా.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్‌ ఆడగా వచ్చిన డబ్బులే తమ ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పినట్లు తెలిసింది.

విదేశాల నుంచి నేరాలు

దుబాయ్‌, బ్యాంకాక్‌, మలేషియా, చైనాతో పాటు.. దేశంలోని పలు నగరాల్లో తిష్టవేసి సైబర్‌ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌ డీసీపీ అరవింద్‌ బాబు తెలిపారు. కమీషన్‌పై బ్యాంకు ఖాతాలు సమకూర్చడానికి, డిపాజిట్‌ అయిన డబ్బును విత్‌ డ్రా చేయడానికి, డాలర్లుగా, క్రిప్టో కరెన్సీగా మార్చడానికి వివిధ నగరాల్లో అనుచరులను నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. మ్యూల్‌ ఖాతాలు ఇస్తున్న దొంగలు మాత్రమే చిక్కుతున్నారని డీసీపీ తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులు అంతిమంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మాఫియా చేతికి, క్రిప్టో కరెన్సీ రూపంలో చైనా ముఠాలకు వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా, విదేశాల్లో ఉంటూ రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ క్రిమినల్స్‌ను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. మ్యూల్‌ ఖాతాలకు సహకరిస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటే కొంతమేర సైబర్‌ నేరాలను అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైబర్‌ నేరాలను అరికట్టటానికి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆపరేషన్‌ ఆక్టోప్‌సను ప్రారంభించారు. దీంట్లో భాగంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాదాపు 10 రాష్ట్రాల్లో జల్లెడపట్టి వందల సంఖ్యలో సైబర్‌ క్రిమినల్స్‌ను, వారికి సహకరిస్తున్న బ్యాంకుల సిబ్బందిని అరెస్టు చేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 05:20 AM