రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ‘సైబర్’ బ్యూరో ఇన్‌స్పెక్టర్
ABN , Publish Date - May 31 , 2026 | 05:37 AM
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు.
హైదరాబాద్/అఫ్జల్‌గంజ్, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఓ సైబర్ మోసానికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబసభ్యులు, స్నేహితులను ఆ కేసులో చేర్చకుండా ఉండాలంటే ఇన్‌స్పెక్టర్ మహేందర్ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేశారు. భయపడిన బాధితులు రూ.5 లక్షల నగదును అందచే సి, అంతటితో సరిపెట్టుకోవాలని ప్రాధేయపడ్డాడు. అయినా సరే తాను అడిగిన మొత్తం ఇవ్వాల్సిందేనని లేదంటే కేసులో ఇరుక్కుంటారని మహేందర్ పదే పదే ఫోన్లు చేసి బెదిరించడంతో నిందితుడి తండ్రి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీకి చెందిన కేంద్ర దర్యాప్తు విభాగం (సీఐయూ) సైబర్ బ్యూరో కార్యాలయంలో శనివారం దాడి చేసి మహేందర్‌ను అరెస్టు చేసింది. అనంతరం మహేందర్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.13 లక్షల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, కొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయని ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రకటించారు. మహేందర్ అక్రమాస్తులపై విచారణ కొనసాగుతోందని, అతడిని న్యాయమూర్తి ముందు హజరుపరిచినట్లు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసు స్టేషన్‌లోని సైబర్ సెక్యూరిటీ వింగ్‌లో ఏసీబీ సోదాలు చేపట్టడం ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ను అరెస్టు చేయడం తెలంగాణ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.