తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్?
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:27 AM
రాష్ట్ర తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం యూపీఎ్‌ససీకి జాబితా పంపగా, అందులో సీనియర్‌గా ఉన్న......
రేసులో వీపీ ఆప్టే, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్.. నేడు ఢిల్లీలో యూపీఎస్‌సీ భేటీ
హైదరాబాద్, మార్చి10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం యూపీఎ్‌ససీకి జాబితా పంపగా, అందులో సీనియర్‌గా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ విషయంలో ప్రభుత్వం మొగ్గుచూపుతోందని విశ్వసనీయవర్గాల సమాచారం. సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి ఢిల్లీలో ముగ్గురు యూపీఎ్‌ససీ ఎంప్యానెల్ కమిటీ సభ్యుల భేటీ బుధవారం జరగనుంది. ఈ కమిటీలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు కూడా సభ్యుడు కావడంతో ఆయన ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఎ్‌ససీ కమిటీ తమకు నాలుగు పేర్లతో అందిన జాబితాను పరిశీలించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముగ్గురి పేర్లతో డీజీపీ నియామకానికి సంబంధించి తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్ధాయి డీజీపీగా నియమిస్తుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియనున్న నేపధ్యంలో ఆలోపే నూతన డీజీపీ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. డీజీపీల నియామకానికి సంబంధించి ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు యూపీఎ్‌ససీ లేఖలు రాసి నియామక ప్రక్రియను గుర్తు చేయాలని, అప్పటికి ఆయా ప్రభుత్వాలు స్పందించకపోతే తమ దృష్టికి తీసుకుని రావాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, గత నెలలో యూపీఎ్‌ససీ తెలంగాణతో పాటు పది రాష్ట్రాల డీజీపీల నియామకానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. తెలంగాణకు సంబంధించి ప్రస్తుత హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ (1991) 2028 జూన్ వరకు, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న వీపీ ఆప్టే(1994) 2029 అక్టోబర్ వరకు, జైళ్లశాఖ డీజీపీగా ఉన్న సౌమ్యామిశ్రా (1994) 2027 డిసెంబరు వరకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌గా పనిచేస్తున్న శిఖాగోయల్(1994) 2029 మార్చి వరకు సర్వీసులో ఉంటారు. వీరిలో సీనియారిటీలో మొదటి స్ధానంలో ఉన్న సీవీ ఆనంద్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నట్లు సమాచారం.