కొత్త డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:44 AM
రాష్ట్ర నూతన డీజీపీగా 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్.. రేపు శివధర్‌రెడ్డి పదవీ విరమణ
అనంతరం.. డీజీపీగా ఆనంద్ బాధ్యతల స్వీకరణ
22 ఏళ్ల వయసులో తొలి ప్రయత్నంలోనే ఐపీఎ్‌సకు ఎంపిక
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోస్టింగ్
హైదరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీగా పలు సంస్కరణలు
విజయవాడ కమిషనర్‌గా రౌడీలపై ఉక్కుపాదం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీగా 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ ఎంప్యానెల్ నివేదిక ప్రకారం సీవీ ఆనంద్‌ను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తారు. వాస్తవానికి శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించడం యూపీఎస్సీ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిందని కొందరు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో యూపీఎస్సీ నియమాల ప్రకారం జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్‌ల పేర్లతో కూడిన జాబితాను పంపించగా.. సీవీ ఆనంద్, వినాయక్‌ప్రభాకర్ ఆప్టే, సౌమ్యామిశ్రాల పేర్లను షార్ట్ లిస్టు చేసి యూపీఎ్‌ససీ ప్రభుత్వానికి తిరిగి పంపింది. వీరిలో ఆనంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించనున్నట్లు తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో విద్యాభ్యాసం
22 ఏళ్ల వయస్సులోనే ఐపీఎస్ సాధించిన సీవీ ఆనంద్ పక్కా హైదరాబాదీ. ఆయన తండ్రి చామ దామోదర్‌రెడ్డి, తల్లి యశోదాదేవి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందినవారు. వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పాతబస్తీలోని జజ్జిఖానా మెటర్నిటీ ఆస్పత్రిలో 1968 జూన్ 5వ తేదీన ఆనంద్ జన్మించారు. దామోదర్‌రెడ్డి అటవీశాఖలో ఫారెస్టు రేంజర్‌గా పని చేస్తూ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పదవీ విరమణ చేశారు. సీవీ ఆనంద్ విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. విద్యారణ్య హైస్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. క్రీడల్లోనూ రాణించారు. హైదరాబాద్ అండర్ 19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1986లో ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్నారు. నిజాం కాలేజీలో బీఏ, ఉస్మానియాలో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశారు. రంజీ ట్రోఫీలో అవకాశం రాకపోవటంతో, 1990లో సివిల్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టారు. 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో పోస్టింగ్
వరంగల్ రూరల్ సబ్‌డివిజన్ ఏఎస్‌పీ, బెల్లంపల్లి అదనపు ఎస్పీ ఆపరేషన్స్, నిజామాబాద్ ఎస్పీగా దాదాపు ఏడేళ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో సీవీ ఆనంద్ పనిచేస్తూ పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్నారు. 2000-2001 మధ్య కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001-04 మధ్య కాలంలో హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఈస్ట్‌జోన్, సెంట్రల్‌జోన్ల డీసీపీగా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. హుస్సేన్ సాగర్ వద్ద లేక్ పోలీసింగ్‌ను ప్రారంభించారు. ఇది వందల మంది ప్రాణాలను కాపాడటానికి దోహదపడింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా లారీలకు, క్రేన్లకు నెంబరింగ్, కోడింగ్ విధానాన్ని ఆయనే ప్రారంభించారు. డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత సీవీ ఆనంద్‌ను సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగంలో నియమించారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కృషి బ్యాంకు స్కామ్ సూత్రధారి కొసరాజు వెంకటేశ్వరరావును బ్యాంకాక్ నుంచి పట్టుకొచ్చారు. తర్వాత ఏలూరు రేంజ్ డీఐజీగా, విజయవాడ కమిషనర్‌గా ఆనంద్ పని చేశారు. విజయవాడలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అనంతరం, ఎక్సైజ్ విభాగంలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ట్రాఫిక్ కమిషనర్‌గా రోడ్లపై విధులు
ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో అదనపు కమిషనర్‌గా సీవీ ఆనంద్ మూడున్నరేళ్లు సేవలందించారు. ఈ చలాన్, డ్రంక్ డ్రైవింగ్, లేన్ డిసిప్లెన్, ట్రాఫిక్ సిగ్నల్ సింక్రనైజేషన్ తదితర నూతన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆనంద్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసినంత కాలం ప్రతిరోజు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు రోడ్ల మీదనే ఉండేవారు. ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి చూసి ఆందోళన చెంది.. వారికి 30శాతం అదనపు భత్యం అవసరమని ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించారు. 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేశా రు. భూ వివాదాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ (ఎస్‌ఓపీ) రూపొందించి, అమలు చేయడం ద్వారా పోలీసులను భూ వివాదాలకు దూరం చేశారు. అదనపు డీజీగా పదోన్నతి పొందిన తర్వాత పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తూ రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సీఐఎస్ఎఫ్‌కు డిప్యూటేషన్‌పై వె ళ్లారు. ఎన్‌ఐఎస్ఏ డైరక్టర్‌గా కొన్నాళ్లు పని చేశా రు. 2021లో హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. 2024లో కొన్నాళ్లు ఏసీబీ డీజీగా చేశారు. గత ఏడాది సెప్టెంబరులో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
కుటుంబ నేపథ్యం
నిజాం కాలేజీలో తన సహాధ్యాయి లలితను సీవీ ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు వీఎఫ్ఎక్స్ రంగంలో రాణిస్తుంటే మరో కుమారుడు మిలింద్ క్రికెట్ రంగంలో ఉన్నారు. హైదరాబాద్ సీనియర్ టీమ్ కెప్టెన్‌గా మిలింద్ ఉన్నారు. సీవీ ఆనంద్ ఇప్పటికీ క్రీడల్లో ప్రతిభను చూపుతున్నారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున 2025-26 సీజన్‌లో ఆయన ఐదు సెంచరీలు చేశారు. టెన్నిస్‌లోనూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.