kumaram bheem asifabad- డ్రిప్ పరికరాల రాయితీల్లో కోత
ABN , Publish Date - May 10 , 2026 | 10:35 PM
తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిం చేందుకు వినియోగించే డ్రిప్ పరికరాల రాయితీని ప్రభుత్వం తగ్గించడంతో బిందు, తుంపర సేద్యం రైతులకు జిల్లాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు బిందు, తుంపర సేద్యం జరిగే భూములతో ఆయా పంటలుంటాయి.
కాగజ్‌నగర్ టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిం చేందుకు వినియోగించే డ్రిప్ పరికరాల రాయితీని ప్రభుత్వం తగ్గించడంతో బిందు, తుంపర సేద్యం రైతులకు జిల్లాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు బిందు, తుంపర సేద్యం జరిగే భూములతో ఆయా పంటలుంటాయి. ఈ పంటలకు బిందు, తుంపర సేద్యం పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉండే భూముల్లో ప్రస్తుతం పామాయిల్ సాగుకు పోత్సాహం అందిస్తున్నాయి. అయితే పామాయిల్‌తో పాటు, కూరగాయలు, సోయాబీన్, మొక్కజొన్న, మామిడి, జామ తదితర పంటలకు డ్రిప్‌ల సేద్యం ఎక్కువగా వాడుతారు. నీటి లభ్యత లేకున్నా బిందు సేద్యంతో ఎక్కువ పంటలు పండించి అధిక లాభాలు రైతులు గడిస్తారు. వనరులు సరిగ్గా లేని చోట డ్రిప్ పరికరాలతో తుంపర, బిందు సేద్యం చేస్తారు. తద్వారా 50 శాతం నీటిని ఆదా చేయవచ్చనే ఉద్యాన, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు పండిస్తున్నారు. డ్రిప్ పరికరాల రాయితీ ఒక్కసారిగా 10 శాతం తగ్గించడంతో రైతులు నిరుత్సాహం చెందే అవకాశాలున్నాయ అంటున్నారు.
- ఎస్సీ, ఎస్టీలకు..
ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ, బీసీ, ఓసీ రైతులకు ఐదెకరాల్లోపు 90 శాతం నుంచి 80 శాతం, ఐదెకరాలకు పైగా ఉన్న వారికి 80 నుంచి 70 శాతానికి రాయితీని ఈ సంవత్సరం తగ్గించారు. దీంతో అన్నదాతలపై భారం పడి నిరుత్సాహపడే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆయిల్‌పాం పంటలు పండించేందుకు ఎక్కువ ఆసక్తిని రైతులు చూపిస్తున్నారు. గతంలో 1000 ఎకరాల్లో ఉండే పంటను ప్రస్తుత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1700 ఎకరాలకు పెరిగిందని అధికారులు అంటు న్నారు. అలాగే కూరగాయలు, కర్బూజా పంటలతో పాటు తోటలకు కూడా అనువైన నేలలున్నాయి. దీంతో రైతులు ఆయా పంటలను పండించి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. కేవలం సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 400 ఎకరాలు కూరగాయలు, వేలాది ఎకరాల మామిడి తోటలున్నాయి. సీజనల్ పంటగా పుచ్చకాయ, తదితర వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. పంటకు నీటిని పారించి ఎక్కువ నీటిని వినియోగించే అవసరం లేకుండా రైతులు భూములకు పైపుల ద్వారా నీరు పంపి బిందు, తుంపర సేద్యంతో పంటలను పండిస్తున్నారు. రాయితీ పరికరాల ధరలు పెరగడంతో వేలాది ఎకరాల్లో రైతులకు ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
- చిన్న, సన్న కారు రైతులకు..
ప్రభుత్వం రాయితీ తగ్గించడంతో చిన్న, సన్నకారు రైతులకు సాగు భారం పడే అవకాశాలున్నాయి. బిందు సేద్యం పెంచాలంటే రైతులకు పోత్సహకాలు అందించాలి. కానీ రాయితీ తగ్గింపుతో రైతులకు భారం పడి పంటల సాగుకు వెనుకంజ వేసే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు లేని చోట తక్కువ నీటి లభ్యతతో రైతులకు ప్రయోజనంగా ఉండే పంటలను వేస్తే అధికంగా లాభపడతారు. కానీ డ్రిప్ పరికరాలకు కంపెనీలకు 10 శాతం డబ్బులు ఎక్కువగా చెల్లించడంతో రైతులపై భారం పడే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పాం పంటను ముమ్మరంగా ప్రభుత్వాలు ప్రోత్సహించి రైతులుకు ఉత్సాహం చూపిస్తున్న ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్‌తో వ్యవసాయాన్ని పెంచేలా చూడాల్సిన అవసరం ఉంది.