అక్రమ నిర్మాణాలపై 300శాతం ఆస్తి పన్ను!
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:39 AM
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ప్రాంగణాల మూత
క్యూర్-2026 ముసాయిదా బిల్లులో ప్రతిపాదన
హైడ్రాకు చట్టబద్ధత, అదనపు అధికారాలు
కబ్జాదారులపై క్రిమినల్ కేసు అధికారం కూడా..
హైదరాబాద్ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమ నిర్మాణాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. క్యూర్ బిల్లు - 2026 ముసాయిదాలో ఈ మేరకు పలు సవరణలు చేసింది. ఇందులో కీలకమైంది అనుమతి లేని నిర్మాణాలపై 300 శాతం ఆస్తిపన్ను విధించటం. జీహెచ్‌ఎంసీ చట్టం -1955 ప్రకారం ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు ఆస్తిపన్నులో 100 శాతం జరిమానా విధిస్తున్నారు. మదింపు జరిగిన అనంతరం నిర్ధారించిన పన్నుకు రెట్టింపు ప్రతి ఏటా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని తాజాగా 300 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అనుమతి లేని, అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించిన భవనాలకూ ఈ నిబంధన వర్తించనుంది.చట్టం అమలులోకి రాకముందుపన్ను మదింపు జరిగి, అనుమతి లేని భవనాలకు 100 శాతం పెనాల్టీ ఉండనుంది. అనుమతి ఉండి సెట్‌బ్యాక్‌లో ఉల్లంఘనలు 10 శాతం వరకు ఉంటే.. 25 శాతం జరిమానా, 10 శాతం కంటే ఎక్కువ ఉల్లంఘన ఉంటే 50 శాతం జరిమానా విధించనున్నారు. నివాస క్యాటగిరీలో అనుమతి తీసుకొని.. నివాసేతర క్యాటగిరీ వినియోగం ఉంటే.. 100 శాతం జరిమానా విధించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యానికి బిల్లులో ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, రవాణా వాహనాల వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే అధికారం కార్పొరేషన్ల కమిషనర్లకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఏదైనా భవనం/ప్రాంగణం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అధికారులు భావిస్తే దానిని మూసివేసే అధికారం కూడా ఉంటుంది. ఈ బిల్లు ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పించనున్నారు. ఈ సంస్థకు మరిన్ని అధికారాలు అప్పగించాలని ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే డ్రైనేజీలు, చెరువులు, కుంటలు, జలాశయాల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా నేరుగా కూల్చివేయగలదు. కబ్జాదారులపై హైడ్రా ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం సంస్థకు కల్పించారు. ఆరు నెలల క్రితమే పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేసినా.. న్యాయపరమైన చిక్కులతో కేసులు నమోదు చేయడం లేదు. చట్టం అమలులోకి వచ్చిన అనంతరం హైడ్రాకు అధికారాలు సంక్రమించనున్నాయి. ప్రజా ఆస్తుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపులో ఇతర ప్రభుత్వ విభాగాలకూ హైడ్రా సహకరించనుంది. అందుకు అయ్యే ఖర్చును సహాయం కోరిన విభాగాలే భరించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రా కూడా ఖర్చు భరించనుంది. ఈ బిల్లులోని సెక్షన్ 262 ప్రకారం అగ్నిమాపక భద్రతా తనిఖీలు కూడా హైడ్రా నిర్వహించనుంది. సెక్షన్ 255 కింద హైడ్రా కమిషనర్ చెరువుల రక్షణ కమిటీ చైర్మన్‌గా, సెక్షన్ 256 కింద విపత్తు నిర్వహణ సంస్థ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మరిన్ని అధికారాలను జీవో ద్వారా అప్పగించే అవకాశాన్ని ముసాయిదాలో ప్రతిపాదించారు.