Share News

భూష్మి శ్రీకాంత్‌ ఆగడాలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:09 AM

వరుస చోరీలకు పాల్పడిన శ్రీకాంత్‌ గ్యాంగ్‌లోని ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

భూష్మి శ్రీకాంత్‌ ఆగడాలకు అడ్డుకట్ట
వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

యువకులను నేరాల వైపు మళ్లిస్తూ శిక్షణ

ముఠాలోని ఆరుగురు అరెస్టు, పరారీలో మరో ఇద్దరు

నల్లగొండ క్రైం, జూలై 19(ఆంధ్రజ్యోతి): వరుస చోరీలకు పాల్పడిన శ్రీకాంత్‌ గ్యాంగ్‌లోని ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ కేసు వివరాలు వెల్లడించారు. క్రిమినల్‌ భూష్మి శ్రీకాంత్‌ విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ వైన్స్‌షాపుల వద్ద పరిచయమైన యువకులను లక్ష్యంగా చేసుకునేవాడు. మొదట వారికి మద్యం తాగించి డబ్బు ఖర్చు పెట్టడం, వ్యక్తిగత సమస్యలు తెలుసుకొని సహాయం చేస్తున్నట్టు నమ్మకం కలిగించడం ద్వారా వారిని దగ్గరకు చేసుకునేవాడు.

డబ్బు సంపాదించే మార్గం చోరీలే అంటూ..

మోస్ట్‌ వాటెండ్‌ క్రిమినల్‌ శ్రీకాంత్‌ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం చోరీలే అంటూ ప్రలోభ పెట్టి నేరాల వైపు మళ్లించేవాడు. తాళాలు ఎలా పగులగొట్టాలి, ఎలాంటి ఇళ్లను లక్ష్యంగా చేసుకోవాలి, రాత్రి వేళల్లో ఎలా చోరీ చేయాలి, పోలీసుల కదలికలను ఎలా గమనించాలి, సీసీ కెమెరాల నుంచి ఎలా తప్పించుకోవాలి, చోరీ చేసిన బంగారం, వెండి ఎక్కడ విక్రయించాలనే అంశాలపై శిక్షణ ఇచ్చేవాడు. తొమ్మిది మంది సభ్యులతో శ్రీకాంత్‌ ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వీరిలో తమిశెట్టి నాగరాజు మినహా, మిగిలిన యువకులకు ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు గుర్తించారు. నాగరాజుపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 10కి పైగా కేసులు ఉండగా, ఒక డెకాయిట్‌ కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. ఈ శిక్షా కాలంలోనే నాగరాజుకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో భూష్మి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. శ్రీకాంత్‌ ముఠా సభ్యులంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కేసుల్లో నిందితులుగా విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులకు సంబంధించి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం మారుతినగర్‌కు చెందిన తమిశెట్టి నాగరాజు లారీ డ్రైవర్‌గా వృత్తి కొనసాగిస్తూ నేరాలకు పాల్పడుతున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన అల్లంశెట్టి సాయికిరణ్‌, సమంతపు వెంకటేష్‌, ఆలేటి కోటేశ్వర్‌రావు, సపావత్‌ నాగకిరణ్‌, బాబునాయక్‌, పిల్లి రాజే్‌షలను అదుపులోకి తీసుకున్నారు. అదే జిల్లాకు చెందిన గాడిబోయిన గోపిసాయి, తమండ్ర రమేష్‌ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆరుగురు నిందితులను శనివారం ఉదయం 9గంటల సమయంలో పిడుగురాళ్ల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన వారి నుంచి సుమారు రూ.53లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.1.50లక్షలు, ద్విచక్ర వాహనాలు, ఏడు మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్‌ రాష్ట్ర చోరీ ముఠా కేసును ఛేదించిన పోలీస్‌ ఉన్నతాధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులను, ప్రశంసాపత్రాలను ప్రకటించారు.

Updated Date - Jul 20 , 2026 | 12:09 AM