Share News

సర్కారీ స్కూళ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు

ABN , Publish Date - May 24 , 2026 | 05:01 AM

తెలంగాణలో హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత....

సర్కారీ స్కూళ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు

  • సీఎస్‌ఆర్‌ కింద నిధులు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖతో ఒప్పందం

హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద ప్రభుత్వ పాఠశాలలకు నిధులు ఇస్తామని రహేజా గ్రూప్‌తో పాటు రాంకీ ఫౌండేషన్‌, యశోదా ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖతో రహేజా గ్రూప్‌, రాంకీ గ్రూప్‌, యశోదా ఫౌండేషన్లు ఒప్పందం చేసుకున్నాయి. రహేజా గ్రూప్‌ అధ్యక్షుడు నీల్‌ సి. రహేజా, రామ్‌ కీ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్‌ డైరెక్టర్‌ గోరుకంటి దేవేందర్‌ రావు సీఎంకు ఒప్పంద పత్రాలు అందించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌ నగర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి అయ్యే వ్యయంలో 40శాతం అంటే రూ. 19.66 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాంకీ సంస్థ తెలిపింది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జడ్పీ ఉన్నత పాఠశాల ఉన్నతీకరణలో భాగంగా ప్రీ-ప్రైమరీనుంచి ఐదవ తరగతి, ఇంటర్మీడియట్‌ తరగతి గదుల నిర్మాణం కోసం అయ్యే ఖర్చులో 40శాతం అంటే రూ.10.4 కోట్లు భరించనున్నట్లు రాంకీ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-పైమరీ నుంచి ఇంటర్‌ వ రకు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమయ్యే రూ.50.50 కోట్లను భరిస్తామని రహేజా గ్రూప్‌ తెలిపింది. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ సుభాష్‌ నగర్‌ మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీతో పాటు 6వ, 7వ తరగతు ల గదుల నిర్మాణం కోసం అవసరమైన రూ. 12.20 కోట్లను భరించనున్నట్లు యశోదా హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ శ్రీ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) చైర్మన్‌ సి శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 05:01 AM