Share News

సీఎస్ఐఆర్‌ నియామక పరీక్షలో కాపీయింగ్‌

ABN , Publish Date - May 19 , 2026 | 04:32 AM

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ సీఎస్ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిధిలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌..

సీఎస్ఐఆర్‌ నియామక పరీక్షలో కాపీయింగ్‌

  • 12 మందిని అరెస్టు చేసిన నాచారం పోలీసులు

తార్నాక, మే 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ సీఎస్ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిధిలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగ నియామక పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మందిని నాచారం పోలీసులు అరెస్టు చేశారు. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌), అటెండర్‌, క్లర్క్‌, కుక్‌(వంట మనిషి) వంటి నాలుగో తరగతి పోస్టుల కోసం ఈ నెల 17న రాత పరీక్ష నిర్వహించారు. సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ నిర్వహించిన ట్రేడ్‌ టెస్టులో గతంలో అర్హత సాధించిన వారికి ఈ పరీక్షను ఏర్పాటు చేశారు. నాచారంలోని సెయింట్‌ పియస్‌ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్వాహకులకు అనుమానం రాగా.. వారు నాచారం పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 12మంది వద్ద మైక్రో ఇయర్‌ ఫోన్లు, స్పై జీఎస్ఎం పరికరాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరు హరియాణాలోని మైండ్‌ క్యూ టైపింగ్‌ సంస్థలో శిక్షణ పొందినట్లు, పరీక్షా కేంద్రం బయట ఉన్న హ్యాండ్లర్ల సాయంతో సమాధానాలు స్వీకరించి పరీక్షలు రాస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.8లక్షలు వసూలుచేశారని.. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 04:32 AM