సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:10 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది...
3 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి మేరకు నిర్ణయం..
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులను జారీ చేసి, రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శికి పంపించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే జూన్ 30 వరకు మూడు నెలల పాటు సీఎ్‌సగా కొనసాగనున్నారు. నిజానికి రాష్ట్ర చరిత్రలో ఇలా ఎక్కువ కాలం సీఎస్ సర్వీసును పొడిగించిన సందర్భాలు లేవు. రామకృష్ణారావుకు రెండు సార్లు పొడిగింపు అవకాశాలిస్తూ మొత్తం 10 నెలల పాటు రాష్ట్రానికి అదనంగా సేవ చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును 2025 ఏప్రిల్ 30న ప్రభుత్వం సీఎస్గా నియమించింది. అదే ఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ చేయాల్సింది. అయితే ఏడు నెలల పాటు ఆయన సర్వీసును పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. ఆ మేరకు కేంద్రం అనుమతించింది. ఈ ఏడు నెలల కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తూ.. సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టుల గురించి చర్చించడానికి ఢిల్లీకి వెళ్లిన సందర్భంలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద సీఎస్ సర్వీసు పొడిగింపు గురించి రేవంత్ ప్రస్తావించారు. అప్పుడు అమిత్ షా ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకపోయినా ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆమేరకు తాజాగా పొడిగింపు ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కా ర్యక్రమం ప్రారంభమైంది. ఇది జూన్ 12 వరకు కొనసాగనుంది. పైగా 2026-27సంవత్సరానికి ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో రామకృష్ణారావు పాత్ర కూడా ఉంది. అందుకే మరో 3నెలల పాటు ఆయన సర్వీసును పొడిగించాలని కోరడంతో కేంద్రం ఆమోదించింది.