Share News

‘సర్‌’పై ప్రజలకు అవగాహన కల్పించండి

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:17 AM

ఓటర్ల జాబితా సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)’ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించి...

‘సర్‌’పై ప్రజలకు అవగాహన కల్పించండి

  • 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించండి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌)’ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించి, భాగస్వాములయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ... ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, పంటల మార్పిడి, లాభదాయక సాగు వంటి అంశాలపై ఈ సభల్లో ప్రజలకు వివరించాలన్నారు. గ్రామ సభల్లో మహిళా స్వయం సహాయక బృందాల మహిళలు పాల్గొనేలా చూడాలన్నారు.

68.30 శాతం మ్యాపింగ్‌ పూర్తి: సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్‌ ఇంటె న్సివ్‌ రివిజన్‌ - సర్‌) మూడో దశ ప్రక్రియను తెలంగాణలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.30 శాతం మ్యాపింగ్‌ పూర్తయిందని చెప్పారు. క్షేత్రస్థాయి ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఈసీఐ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌, ఉప కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం అధికారులు సర్‌పై సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు, నోటీసుల జారీ, వాటి పరిష్కారం, తుది ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

Updated Date - Jun 03 , 2026 | 05:17 AM