తాడ్వాయి సమీపంలో లారీ బీభత్సం
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:31 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది.
సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
క్షతగాత్రుల్లో ముగ్గురు జవాన్లు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
మద్యం మత్తులో లారీపై
నియంత్రణ కోల్పోయిన డైవ్రర్
తాడ్వాయి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లతో వ్యాన్‌తోపాటు, ఒక కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యా యి. గురువారం ఉదయం ఏటూరునాగారం వైపు ఇసుక లోడ్ కోసం వెళ్తున్న లారీ తాడ్వాయి మండలం పరిధిలో జాతీయ రహదారి-163పై అదుపు తప్పింది. వాజేడు మండలం మురుమూరు బేస్ క్యాంపు నుంచి వెంకటాపురం మండలం ఇంచర్ల హెడ్‌క్వార్టర్‌కు సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొంది. అనంతరం దాని వెనుకాలే వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం వడకపురం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రమాకాంత్ (35) మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ గిరీష్ కుమార్, జవాన్లు ప్రేమ్ ప్రకాశ్, రామ్ జయన ప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. అలా గే కారులో ప్రయాణిస్తున్న తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయ టైపిస్టు రమేష్, గోవిందరావు ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సఫియాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ చక్రపాణి పోలీసులకు లొంగిపోయాడు. అతడు మద్యం సేవించి ఉండ టం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.