Share News

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:53 AM

కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ

  • సీఆర్పీఎఫ్‌ జవాన్‌కు తీవ్ర గాయాలు

  • ములుగు జిల్లా వెంకటాపురంలో ఘటన

వెంకటాపురం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పేలుడులో సీఆర్పీఎఫ్‌-39 బెటాలియన్‌కు చెందిన నవజీత్‌ పాఠక్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో వరంగల్‌కు తరలించినట్లు తెలిసింది. ఆపరేషన్‌ కగార్‌-2 పేరుతో కేంద్ర బలగాలు మూడు రోజులుగా కర్రెగుట్టల్లో విస్తృత కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వాజేడు మండలంలోని మురుమూరు గ్రామంలో సీఆర్పీఎఫ్‌ బేస్‌క్యాంపును ఏర్పాటు చేశారు. మురుమూరు బేస్‌క్యాంపు నుంచి వెంకటాపురం మండలంలోని గుట్టలపై ఉన్న పామునూరు వరకు 10కి.మీ. రోడ్డును నిర్మించి మరో బేస్‌క్యాంపును నెలకొల్పారు. పామునూరు నుంచి జెల్లా, డోలి, తడపల వరకు ఇంకొక క్యాంపును ఏర్పాటు చేయాలనే యోచనతో గుట్టలపై రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను సీఆర్పీఎఫ్‌ బలగాలు గుర్తించాయి. 11 ఐఈడీలను నిర్వీర్యం చేశాయి. మరోఐఈడీని తొలగిస్తున్న క్రమంలో పేలుడు సంభవించి జవాన్‌కు గాయాలయ్యాయి. కాగా, కర్రెగుట్టల్లో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిని ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు.

Updated Date - Feb 21 , 2026 | 02:53 AM