Sankranti Festival Gambling: కోట్లా..ట
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:04 AM
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్లు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి. కోడిపందేలతోపాటు గుండాట, కోతాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మూడు రోజుల్లో రూ.500 కోట్ల వరకు పందేలు...
కాసులు రాల్చిన కోడి కూత
పండగ 3 రోజులూ ‘బరి’లోనే గోదారి.. ఏపీలో రూ.2 వేల కోట్ల పందేలు
తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1.53 కోట్లు.. గుండాట, పేకాట్లలో 500 కోట్లు
‘కృష్ణా’లో 800 కోట్లు.. పశ్చిమలో 300 కోట్లు.. ‘బాపట్ల’లో 200 కోట్ల పందేలు
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్లు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి. కోడిపందేలతోపాటు గుండాట, కోతాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మూడు రోజుల్లో రూ.500 కోట్ల వరకు పందేలు తెగినట్టు అంచనా. ఒక్క కాకినాడ జిల్లాలోనే ఏకంగా రూ.250 కోట్ల లావాదేవీలు సాగినట్టు చెబుతున్నారు. ఒక్కో బరి వద్ద మూడు నుంచి నాలుగు గుండాట బోర్డులు ఏర్పాటు చేయించి నిర్వాహకులు లాభాలు వెనకేసుకున్నారు. కరప మండలంలో కోడిపందేలు మూడు రోజులు కలిపి రూ.15 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. తాళ్లరేవులో అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత యానాం రిసార్ట్‌లో 40 గదులు బుక్ చేయించి మూడు రోజులు రేయింబవళ్లు పేకాట ఆడించారు. మూడు బోర్డుల గేమ్ పేకాటలో రోజుకు మొదటి విన్నర్ రూ.కోటి వరకు గెలుచుకున్నారు. మగువలను కూడా తీసుకువచ్చి చిందులేశారు. మొత్తం పేకాట టర్నోవర్ రూ.12 కోట్లని అంచనా. కాకినాడ రూరల్, కరప, ఉండూరు, కందరాడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పందేల వద్ద ప్రవేశ రుసుం కనీసం రూ.1.50 లక్షలుగా ఉంది. ఎక్కడిక్కడ భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. పందేలు తిలకిస్తున్న వారికి ఉదయం టిఫిన్, మధ్యలో స్నాక్స్, పలు రకాల వంటలతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటుచేశారు. పలు బరుల వద్ద రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. తునిలో రూ.8 కోట్లకుపైగా పందేలు జరిగాయి. పక్కనే ఉన్న అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి పందెం రాయుళ్లు ఇక్కడకు పోటెత్తారు.
కోనసీమలో పందేల జోరు...
ఫ్లడ్‌లైట్లు, డిజిటల్ స్ర్కీన్‌లతో సర్వహంగులతో అంబేడ్కర్ కోనసీమ జిలాల్లోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఏర్పాటుచేసిన అతిపెద్ద కోడిపందాల బరికి ప్రముఖులు పోటెత్తారు. ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. జిల్లావ్యాప్తంగా వందకుపైగా పందెంబరులతోపాటు వందలాది బోర్డులతో గుండాటలు, పేకాటలు వంటివి జోరుగా సాగాయి. మూడురోజులపాటు సుమారు రూ.150 కోట్ల మేర జూద క్రీడల జాతరలో వెచ్చించినట్టు సమాచారం. ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు ముఖ్యంగా మహిళలు కోడిపందాలను తిలకించారు. ఇక రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో 20కి పైగా ప్రాంతాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్స్‌లు హోరెత్తిపోయాయి.
‘తూర్పు’ పందెం రూ.100 కోట్లపైనే
తూర్పుగోదావరి జిల్లాలో చాలాచోట్ల కార్పొరేట్ లెవల్‌లో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు జోరుగా సాగాయి. రూ.100కోట్లకుపైగానే చేతులు మారినట్టు అంచనా. మొత్తం 150 వరకూ బరులు నిర్వహించారు. ఒక్కో బరి వద్ద నాలుగు నుంచి ఆరు వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక.. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజులు కలిపి సుమారు రూ. 300 కోట్లు చేతులు మారాయి.
ఏలూరులో రూ. 200 కోట్లు తెగాయి.
ఏలూరు జిల్లాకు ఈసారి పెద్దఎత్తున తెలంగాణ జిల్లాల నుంచి ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులు పోటెత్తడంతో కోడి పందేలు రంజుగా సాగాయి. భోగి నుంచి కనుమ శుక్రవారం సాయంత్రం వరకు రూ.200 కోట్ల పైగా పందేలు తెగినట్టు చెబుతున్నాయి.
‘బాపట్ల’లోనూ రూ.200 కోట్ల పందేలు
బాపట్ల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కోడి పందేల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. ఒక్క చెరుకుపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన బరిలోనే పండుగ మూడు రోజుల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు పందేలు సాగినట్లు అంచనా. ప్రధాన బరుల వద్ద నిర్వహించిన కోడి పందేల్లో ఆరుగురు బుల్లెట్లను గెలుచుకున్నారు.
సేతువాపై డేగ ఆధిపత్యం..1.53 కోట్ల పందెం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలోని పైబోయిన వెంకట రామయ్య తోటతో గురువారం భారీ కోడి పందెం జరిగింది. రాష్ట్రంలోనే ఈ పందెం సంచలనం సృష్టించింది. గతేడాది రూ.కోటి 25 లక్షలు గెలుచుకున్న గుడివాడ ప్రభాకర్ మరోసారి కోట్ల పందెంలో నిలవగా, ఈ సారి రాజమండ్రికి చెందిన రమేశ్ టీమ్ పందేనికి సై అన్నారు. సేతువా (పుంజు)తో గుడివాడ ప్రభాకర్ రూ.కోటి 53 లక్షలతో బరిలోకి వచ్చి కాలుదువ్వగా రాజమండ్రి రమేశ్ డేగ (పుంజు) సై అంది. ఈ పోటీలో గెలిచిన రాజమండ్రి రమేశ్ టీమ్ రూ.1. 53 కోట్లు సొంతం చేసుకుంది.
పోలీసు కాన్వాయ్‌తో వచ్చి.. రూ.కోటి పట్టి..
ఉమ్మడి కృష్ణా జిల్లా కీసరలో ఓ వ్యక్తి 25 కోడి పం దేలు గెలిచి బుల్లెట్‌ను బహుమతిగా అందుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఒక ప్రముఖుడు రూ.కోటి గెలుచుకున్నారు. పోలీసు కాన్వాయ్‌తో వచ్చిన ఆయన ఒకే ఒక పందెం కట్టి పది నిమిషాల్లోనే రూ.కోటి కొల్లగొట్టారు. ఇక ‘కృష్ణా’లో మూడు రోజుల్లో రూ. 800 కోట్ల పందేలు తెగాయి. ఈసారి బరుల వద్ద ఎన్‌ఆర్‌ఐ మహిళలు సందడి చేశారు.
లక్కీ డ్రాలో రూ. 25 లక్షల కారు..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం కోడిపందేల బరిలో పొత్తూరి నరసింహరాజుకు అదృష్టం వరించింది. శుక్రవారం లక్కీ డ్రా తీయగా, ఫత్తేపురం సొసైటీ అధ్యక్షుడు పొత్తూరి నరసింహరాజు అండ్ టీమ్ సభ్యులకు స్కార్పియో దక్కింది.