ప్రాణం తీసిన పంట వ్యర్థాల పొగ
ABN , Publish Date - May 20 , 2026 | 03:59 AM
పంట వ్యర్థాలు తగలబడడంతో ఏర్పడిన పొగ.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపురం శివారులో మంగళవారం ...
వాహనాన్ని ఢీ కొట్టిన బైక్.. అక్కడికక్కడే యువకుడి మృతి
నడికూడ, మే 19 (ఆంధ్రజ్యోతి): పంట వ్యర్థాలు తగలబడడంతో ఏర్పడిన పొగ.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపురం శివారులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నడికూడకు చెందిన ఆకారపు క్రాంతి (34) సెల్‌ఫోన్ రిపేరింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. సెల్‌ఫోన్ విడిభాగాల కోసం తన ద్విచక్రవాహనంపై మంగళవారం ఉదయం హనుమకొండకు బయలుదేరాడు. కంఠాత్మకూర్- రామకృష్ణాపురం రోడ్డు పక్కన పంట వ్యర్థాలు తగలబడడంతో దట్టమైన పొగ రోడ్డును కమ్మేసింది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన క్రాంతి.. ఎగిరి రోడ్డు పక్కన పడిపోయాడు. తలకు బలమైన దెబ్బలు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. దామెర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కొందరు రైతులు పంట వ్యర్థాలను ఇష్టానుసారంగా తగలబెడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.