NEET PG Entrance Exam: మైనస్ మార్కులతో పీజీ ప్రవేశాలా?
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:50 AM
పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి మైనస్ 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీసుకున్న నిర్ణయంపై..
వైద్య విద్య నాణ్యతపై నీలినీడలు?.. మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే
‘ప్రైవేటు’లోనే అధికం.. ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి మైనస్ 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 18 వేలకు పైగా పీజీ సీట్లు మిగిలిపోవడంతో.. వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై వైద్యరంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పీజీ ఎంట్రెన్స్‌లో 200 ప్రశ్నలుంటాయి. ఒక్కో సరైన సమాధానానికీ నాలుగు మార్కులు. అంటే.. మొత్తం 800 మార్కులు. తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులిస్తారు. ఒక్కో తప్పు జవాబుకూ ఒక మార్క్ మైనస్ చేస్తారు. కనీసం 40 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే.. 160 మార్కులు వస్తాయి. మిగిలిన 160 ప్రశ్నలకూ తప్పు సమాధానాలిచ్చినా 160 మార్కులు మైనస్ అయ్యి జీరో వస్తుంది. అప్పుడు అభ్యర్థికి నీట్ పీజీలో జీరో మార్కులువచ్చినట్లుగా పరిగణిస్తారు. ఇక్కడ జీరో మార్కులకు కాదు.. అంతకన్నా తక్కువగా.. మైనస్ 40 మార్కులొచ్చినా (అంటే కేవలం 32 ప్రశ్నలకే సరైన సమాధానాలు రాసి, మిగతా 168 ప్రశ్నలకూ తప్పు జవాబు ఇచ్చినా) పీజీ వైద్య విద్యలో ప్రవేశాలు కల్పిస్తామనడంపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తరాదిన పెంచినా..
పీజీలో క్లినికల్, నాన్ క్లినికల్ సబ్జెక్టులుంటాయి. ప్రధానంగా నాన్ క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ ఉంటాయి. వీటిలో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ సీట్లు ఎక్కువగా మిగిలిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాన్ క్లినికల్ సీట్లు దాదాపు భర్తీ అవుతుంటాయని, అందుకు ప్రధాన కారణం స్టైపెండేనని అంటున్నారు. పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు సర్కారు స్టైపెండ్ కింద నెలకు రూ.78-80 వేలు ఇస్తుంది. దాంతో నాన్ క్లినికల్ సీట్లు పెద్దగా మిగలవని అంటున్నారు. మిగిలే సీట్లన్నీ కూడా ప్రైవేటు వైద్య కళాశాలల్లోనే ఉంటాయని.. వారు పీజీలకు స్టైపెండ్ చెల్లించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యవిద్య నిపుణులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలోనూ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోతుంటాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఉత్తరాదితో పోల్చితే మాత్రం.. దక్షిణాది రాష్ట్రాల్లో పీజీ సీట్లు పెద్దగా మిగలవని వైద్యనిపుణులు చెబుతున్నారు. దక్షిణాదిన మెడికల్ కాలేజీలు, యూజీ సీట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఉత్తరాదినా గత ఐదారేళ్లలో యూజీ, పీజీ సీట్లను పెంచారు. కానీ యూజీ పూర్తి చేయాలంటే ఐదేళ్లు పడుతుంది. అది పూర్తి కాకుండానే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా పీజీ సీట్లు పెంచడం వల్ల అర్హులైన అభ్యర్థులు లేక అక్కడ సీట్లు మిగిలిపోతున్నట్లు వైద్య విద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు.