Share News

గోవధకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెట్టాలి

ABN , Publish Date - May 22 , 2026 | 03:57 AM

గోవధకు పాల్పడేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమలులో ..

గోవధకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెట్టాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): గోవధకు పాల్పడేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోమాతను కాపాడుకోవడానికి, చట్టాన్ని రక్షించడానికి శాంతియుతంగా ప్రయత్నిస్తున్న గోరక్షకులను, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్యకర్తలపై విధించిన బైండోవర్‌ చర్యలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గోవధ నిరోధక చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో కఠినంగా అమలు చేయాలని అన్నారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాంచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ వచ్చే నెలలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో ఆయన పర్యటన కొనసాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - May 22 , 2026 | 03:57 AM