kumaram bheem asifabad- ప్రభుత్వ భూముల అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:15 PM
ప్రభుత్వ భూములను అక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమణలను వెంటనే తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను అక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమణలను వెంటనే తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ శివారులో సంకల్పం గ్రీన్‌సిటీ పేరుతో 85/3, 86/3, 87/3 సర్వేనంబర్లలో లేఅవుట్‌కు అనుమతులు తీసుకొని సర్వేనంబర్లు 79, 80 లోని సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని చెప్పారు. అదే విధంగా మున్సిపాలిటీకి చెందిన 216, 217, 218 సర్వే నంబర్లలోని భూమిని కూడా ఆక్రమించినట్లు ఆరోపించారు. శిశుమందిర్‌కు చెందిన భూమి సైతం ఆక్రమణకు గురైందన్నారు. అనుమతులు ఒకచోట తీసుకొని హద్దులు మార్చి ప్రభుత్వ భూములను కలుపుకొని వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్‌లో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వాటిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తా మని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, నాయకులు కొట్నాక విజయ్, సెర్లమురళీ, ఖాండ్రే విశాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగాపంద్రాగస్టును పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ దేశ భక్తిని చాటే విధంగా వివిధ కార్యక్రమాలను ప్రజలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అరిగెల మల్లికార్జున్, కొట్నాక విజయ్, ఖాండ్రే విశాల్, మురళీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.