రుణం సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:28 AM
బంగారంపై తీసుకున్న రుణం మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించుకుని క్రికెట్ బెట్టింగ్‌కు వెచ్చించిన ఐఏఎ్‌ఫఎల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజర్ మోసం పోలీసుల విచారణలో బయటపడింది.
ఐఏఎ్‌ఫఎల్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ మోసం
మేనేజర్ నుంచి రూ.4లక్షల నగదు రికవరీ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన
మిర్యాలగూడ అర్బన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): బంగారంపై తీసుకున్న రుణం మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించుకుని క్రికెట్ బెట్టింగ్‌కు వెచ్చించిన ఐఏఎ్‌ఫఎల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజర్ మోసం పోలీసుల విచారణలో బయటపడింది. గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. మాడ్గులపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి రెండేళ్లుగా ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎ్‌ఫఎల్) మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది, రెండేళ్ల క్రితం రుణాలు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించే స్థోమత లేక బహిరంగ మార్కెట్ ధరకు జ్యువెలరీ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన మండల శంకర్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి విక్రయించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ మేరకు గత నెల 2వ తేదీన శంకర్ తనకు పరిచయస్తుడైన జ్యువెలరీ వ్యాపారి మడూరి ఉపేంద్రచారితో కలిసి ఫైనాన్స్ సంస్థకు వెళ్లాడు. తాకట్టులో బంగారం విడిపించేందుకు రూ.9.60లక్షలు అప్పు చెల్లించాల్పి ఉన్నట్లు మేనేజర్ లెక్కతేల్చాడు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు.
వ్యక్తిగత ఖాతాకు నగదు పంపేలా చేసి...
ఫైనాన్స్ సంస్థ కరెంట్ ఖాతా పనిచేయడం లేదని, తన ఖాతాకు నగదు పంపిస్తే మరుసటి రోజు చెల్లించి బంగారం ఇస్తానని బ్రాంచ్ మేనేజర్ యాదగిరి నమ్మించాడు. శంకర్ ఆ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ వ్యక్తిగత ఖాతాకు పంపగా, గోల్డ్‌లోన్ ఖాతాకు జమ చేయకుండా పాస్‌వర్డ్ తప్పుగా నమోదుచేస్తూ ఆభరణాలు ఇచ్చేందుకు వాయిదాపెడుతున్నాడు. దీనిని అనుమానించిన శంకర్ ఈ నెల 3వ తేదీన మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆ నగదును ఫైనాన్స్ సంస్థ కరెంట్ ఖాతాలోకి మళ్లించకుండా క్రికెట్ బెట్టింగ్‌లకు ఖర్చు చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలోనూ ఇదే విధంగా సుధీర్ అనే ఖాతాదారుడిని మోసం చేసినట్లు మేనేజర్ యాదగిరి అంగీకరించటంతో కేసు నమోదు చేసి, రూ.4లక్షల నగదు, సెల్‌ఫోన్ రికవరీ చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.