యాక్సిడెంట్ జరిగిన చోట..మృతుల ఫొటోల ప్రదర్శన
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:16 AM
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట.. ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనాలను విగ్రహల వలే ఏర్పాటు చేస్తామని, దాంతో పాటు ప్రమాదంలో మృతి ..
ప్రమాదాల నివారణే లక్ష్యంగా కార్యక్రమాలు
త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు: మంత్రి పొన్నం
సిద్దిపేట జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట.. ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన వాహనాలను విగ్రహల వలే ఏర్పాటు చేస్తామని, దాంతో పాటు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫొటోలను కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాద ఫొటోలు కనిపించగానే వాహనాలను నడిపే వారు.. వేగాన్ని తగ్గిస్తారని, ప్రయాణికులు గమ్యానికి సురక్షితంగా చేరుకునే అవకాశముంటుందన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఏ జిల్లాకు అవసరమయ్యే సన్న బియ్యం అక్కడే పండించి, కొనుగోలు చేసేలా వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు ఆయిల్‌పామ్ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయని, కాలువల గట్లు, ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈత వనాల పెంపు ద్వారా గౌడన్నలకు ఉపాది లభిస్తుందన్నారు.