Share News

అరకొర పింఛనుతో వైద్యఖర్చులు ఎలా ?

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:38 AM

సీపీఎస్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం..

అరకొర పింఛనుతో వైద్యఖర్చులు ఎలా ?

  • ఉచిత వైద్యం హామీ ఇస్తేనే.. చందాకు అంగీకారం

  • ప్రభుత్వ నిర్ణయంపై సీపీఎస్‌ ఉద్యోగుల గళం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్ర జ్యోతి): సీపీఎస్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స) కోసం మూల వేతనం నుంచి 1.5శాతం చందా మినహాయించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే సీపీఎస్‌ కోసం 10 శాతం బేసిక్‌ ప్లస్‌ డీఏలో కోత విధిస్తున్నారని, ఇప్పుడు అదనంగా ఆరోగ్య పథకం పేరుతో చందా వసూలు చేయడం సమంజసం కాదని సీపీఎస్‌ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వాపోయారు. పదవీ విరమణ తర్వాత వచ్చే అరకొర పెన్షన్‌తో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భరించడం అసాధ్యమని, ఈ పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు ఉచిత ఆరోగ్యబీమా కల్పించకుండా.. చందా వసూలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తేనే.. ప్రస్తుత వేతనం నుంచి 1.5శాతం కోతకు రాష్ట్రంలోని 2.6లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు అంగీకరిస్తారని బుధవారం ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపే జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సీపీఎస్‌ సంఘం నుంచి ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం వల్ల తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 02:38 AM