Share News

ఎంపీలూ ఎమ్మెల్యేల పెంపు సరే సీపీఎస్‌ ఉద్యోగులు ఆర్థిక భారమా?

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:29 AM

మూడు దశాబ్ధాలుగా దేశ, రాష్ట్రప్రగతి కోసం పని చేస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులను ప్రభుత్వాలు ఆర్థిక భారంగా పరిగణించడాన్ని తెలంగాణ సీపీఎస్‌...

ఎంపీలూ ఎమ్మెల్యేల పెంపు సరే సీపీఎస్‌ ఉద్యోగులు ఆర్థిక భారమా?

  • ప్రభుత్వాల తీరును ఖండించిన సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్ర జ్యోతి): మూడు దశాబ్ధాలుగా దేశ, రాష్ట్రప్రగతి కోసం పని చేస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులను ప్రభుత్వాలు ఆర్థిక భారంగా పరిగణించడాన్ని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఖండించింది. జాతి నిర్మాణం పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపు భారం కాదని భావిస్తున్న ప్రభుత్వాలకు సీపీఎస్‌ ఉద్యోగులు భారమయ్యారా అని సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయన్నారు. 543 లోక్‌సభ స్థానాలు 848కి, రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు 153 నుంచి 180 వరకు పెరిగే అవకాశముందని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్తగా 305 మంది ఎంపీలు వస్తారని, వారి జీత భత్యాలు, పెన్షన్లు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జాతి నిర్మాణం పేరుతో జరిగే ఈ ఖర్చును ప్రభుత్వాలు సమర్థించుకుంటున్నాయని స్థితప్రజ్ఞ, కల్వల్‌ శ్రీకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులోకి వచ్చిన ఉద్యోగులపై రుద్దిన సీపీఎస్‌ వల్ల రిటైర్మెంట్‌ తర్వాత కనీప పెన్షన్‌ కూడా రావడం లేదన్నారు. పాత పెన్షన్‌ పథకా (ఓపీఎస్‌)న్ని పునరుద్ధరించడం సర్కారు ఆర్థిక భారంగా పరిగణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై చేసే ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించాలని వారు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద ప్రమాణాలు, వివక్షాపూరిత విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, ఉద్యోగులకు మరో న్యాయం అనేది సరికాదన్నారు. తక్షణం సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేయాలని స్థితప్రజ్ఞ, శ్రీకాంత్‌ కోరారు.

Updated Date - Apr 21 , 2026 | 04:29 AM