వాణిజ్య గ్యాస్ ధరల పెంపు సరికాదు
ABN , Publish Date - May 03 , 2026 | 05:20 AM
వంటగ్యాస్ ధరల పెంపును గ్యాస్ కంపెనీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ...
కేంద్రం తీరు పేదలకు వ్యతిరేకం.. సీపీఎం ఆగ్రహం
దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి) : వంటగ్యాస్ ధరల పెంపును గ్యాస్ కంపెనీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఎల్పీజీ ధరల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు శనివారం పిలుపునిచ్చింది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంతో ఇప్పటికే అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో వంట గ్యాస్ ధరలను పెంచడం క్రూరమైన చర్య అని కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాస్ సిలిండర్ల కొరత, పెరిగిన ధరల వల్ల ఇప్పటికే వేలాది మంది వలస కార్మికులు నగరాలు, పట్టణాలను వదిలి తమ గ్రామాలకు వెళ్లిపోయారని, తాజాగా గ్యాస్ ధరల పెంపుతో మరింత మంది స్వస్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కమర్షియల్ సిలిండర్ల ధరలను మునుపెన్నడూ లేని విధంగా దాదాపు రూ.వెయ్యి మేర పెంచడం వల్ల దాని ప్రభావం గొలుసుకట్టుగా అన్ని రంగాలపై పడుతుందని, వ్యాపార సంస్థలు ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టడం ఖాయమని పేర్కొంది. అనేక చిన్న చిన్న సంస్థలు మూతపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, దీనివల్ల ఇప్పటికే మొదలైన ఉద్యోగాల కోత మరింత పెరిగి నిరుద్యోగం తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ ధరల పెంపు.. కేంద్రప్రభుత్వ పేదల వ్యతిరేక ధోరణిని బయటపెడుతోందని విమర్శించింది.