kunamneni: రాజకీయ ఆధిపత్యం కోసమే హత్యలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:56 AM
రాజకీయ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వామపక్షాల నేతలు ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు నిందితులను పోలీసులు నేటికీ అరెస్ట్...
సామినేని రామారావు హత్యకేసు విచారణలో పోలీసుల వైఫల్యం
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: వామపక్షాల నేతలు
రాంనగర్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాజకీయ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వామపక్షాల నేతలు ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు నిందితులను పోలీసులు నేటికీ అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. రామారావు హంతకులను వెంటనే శిక్షించాలంటూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ‘‘సామినేని రామారావు హత్య కేసు విచారణలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిజమైన హంతకులను పట్టుకోకుండా కుటుంబ సభ్యులను వేధించడం కేసును పక్కదారి పట్టించడమే. హంతకులను విచారించే పద్ధతిలో పక్షపాతం ఉండకూడదు. హత్యా రాజకీయాలపై వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతాం’’ అని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యిదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. హంతకులను పట్టుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. హత్య జరిగిన రోజు మాత్రమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారని, కానీ.. విచారణలో పోలీసులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో సీపీఎం బలంగా ఉన్న గ్రామాల్లో గతంలోనూ హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదనే కుట్రతో తమ నాయకులను హత్య చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా సీపీఎం గెలిచిన గ్రామపంచాయతీల్లో కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. నిజమైన హంతకులను పట్టుకునే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామని ప్రకటించారు.