Share News

రాజ్యాంగంపై మోదీ బుల్డోజర్‌!

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:32 AM

ఇండియా గేట్‌ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసే సెల్యూట్‌.. భారత రాజ్యాంగానికి కాదని, అది రాజ్యాంగాన్ని అంగీకరించని ఆరెస్సెస్‌ భావజాలానికి, సంఘ్‌ పరివారానికేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ అన్నారు.

రాజ్యాంగంపై మోదీ బుల్డోజర్‌!

  • ఆయన సెల్యూట్‌ రాజ్యాంగానికి కాదు సంఘ్‌కు.. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

  • మహిళా రిజర్వేషన్లపై పార్టీల ద్వంద్వ వైఖరి

  • కేరళలో వెలుగులు.. దేశంలో చీకటి పాలన

  • ‘ఆంధ్రజ్యోతి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇండియా గేట్‌ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసే సెల్యూట్‌.. భారత రాజ్యాంగానికి కాదని, అది రాజ్యాంగాన్ని అంగీకరించని ఆరెస్సెస్‌ భావజాలానికి, సంఘ్‌ పరివారానికేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ అన్నారు. పేద మహిళలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మోదీ అంతం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై మహిళా లోకం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై బుల్డోజర్‌ నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.

దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, అణచివేతకు ప్రధాన కారణాలేంటి?

దేశంలో మహిళలపై జరుగుతున్న హింస సామాజిక సమస్య మాత్రమే కాదు.. ఇది రాజకీయ వైఫల్యం. ప్రస్తుతం బీజేపీ-ఆరెస్సెస్‌ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోంది. రాజ్యాంగంపై బుల్డోజర్‌ నడిపితే మొదట హరించేది సామాన్య మహిళల హక్కులే. న్యాయవ్యవస్థ బలహీనపడితే, పోలీసు వ్యవస్థ బాధ్యత తీసుకోకపోతే నేరస్థులకు ధైర్యం వస్తుంది. ప్రభుత్వం మహిళల భద్రతపై పూర్తి బాధ్యత తీసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. ఇది ఆందోళనకర విషయం.

మహిళా సాధికారత కోసం ఐద్వా ఉద్యమాలు ఎలా సాగుతున్నాయ్‌?

ఐద్వా మహిళల పోరాట స్వరం. సాధికారత అనేది మాటల్లో కాదు, హక్కుల్లో కనిపించాలి. మహిళలపై హింసకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఉపాధి, సమాన వేతనం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపైనా ఉద్యమిస్తున్నాం. పేద మహిళలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆ పథకం లేకపోతే గ్రామీణ మహిళల జీవనం ప్రశ్నార్థకం అవుతుంది. ఈ పథకాన్ని పునరుద్ధరించే వరకు మహిళలు పోరాటం చేస్తారు. కొత్త చట్టం వల్ల గ్రామీణ మహిళలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.


మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు కావడం లేదు?

మహిళా రిజర్వేషన్ల బిల్లు ఏళ్లుగా వాయిదా పడుతూనే ఉంది. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరే దీనికి కారణం. మహిళల ఓట్లు కావాలి కానీ, మహిళలకు అధికారం ఇవ్వాలంటే వెనకడుగు వేస్తారు. నిజాయతీ ఉంటే ఈ బిల్లు ఎప్పుడో అమలయ్యేది. దేశంలో మహిళా రిజర్వేషన్‌ పేరుతో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలను నడుపుతోంది. జనాభాలో సగానికిపైగా ఉన్న మహిళలకు చట్టసభల్లో నిర్ణయాత్మక భాగస్వామ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వైఫల్యంగానే చూడాలి. ఐద్వా దీనిపై రాజీలేని పోరాటం చేస్తుంది.

ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

ఆర్థిక సంక్షోభం ప్రభావం మొదటగా పడేది మహిళలపైనే. ధరల పెరుగుదలతో ఇంటి ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగంతో మహిళల ఉపాధి తగ్గిపోతుంది. అసంఘటిత రంగంలోని మహిళలకు రక్షణ ఉండదు. మరోవైపు బీజేపీ-ఆరెస్సెస్‌ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. ఈ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మహిళలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చీకటి పాలన సాగుతున్న వేళ, కేరళ ప్రభుత్వం మాత్రం మహిళా వికాసానికి, సామాజిక న్యాయానికి ఒక వెలుగులా పని చేస్తోంది.

వామపక్షాల బలహీనతకు కారణం ఏంటి?

వామపక్షాలు బలహీన పడడానికి రాజకీయ పరిస్థితులు మారిపోవడం ఒక కారణమైతే.. కార్పొరేట్‌ శక్తుల ప్రాబల్యం పెరగడం మరో కారణం. యువత, కార్మికులు, రైతులు, మహిళల సమస్యలపై వామపక్షాలు బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. బెంగాల్‌లో సీపీఎంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. త్రిపురలోనూ బీజేపీ కూటమి పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారు. కేరళలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్‌ నాయకత్వంలోనే (ఎల్‌డీఎఫ్‌) ఎన్నికలకు వెళుతున్నాం.

Updated Date - Jan 28 , 2026 | 03:32 AM